పుట:Kopparapu-soodara-kavula-kavitvamu.pdf/16

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆశుకవిత్వానికి - అక్షరార్చన

-ఆచార్య బేతవోలు రామబ్రహ్మం

(పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం)

గంటకు 400 పద్యాలు, 500 పద్యాలు ఆశువుగా చెప్పినవారు, చెప్పేవారు తెలుగు సాహిత్య చరిత్రలో 'కొప్పరపు సోదరకవులు' తప్ప ఇక ఎవ్వరు లేరు. నువ్వా, నేనా? అని పరీక్షించడానికే వచ్చి కూర్చున్న పృచ్ఛకుల మధ్య అత్యాశువుగా ప్రబంధ నిర్మాణం చేసిన ఘట్టం చరిత్రలో 'అపూర్వం'. అది కొప్పరపు కవులు ఒకసారి కాదు. చాలాసార్లు చేశారు. ఎక్కడ ఎవరు ఏ ఘట్టం ఇచ్చి ప్రబంధం చెప్పమంటే అప్పటికప్పుడే కొన్ని వందల పద్యాలతో అత్యాశువుగా ప్రబంధ నిర్మాణం చేయడం అనేది ఒక గొప్ప విద్య, అది సరస్వతీ ప్రసాదం. ఇది తలచుకుంటేనే ఒళ్ళు గగుర్పొడుస్తుంది.

కవులలో మూడు రకాలుంటారని మనవాళ్ళు చెప్పారు. సహజకవులు, ఆభ్యాసిక కవులు, ఔపదేశిక కవులు. మంత్రసిద్ధివల్ల, మంత్ర, తంత్ర, ఉపదేశాలవల్ల కవిత్వ కరణ సమర్ధులవుతారు, కావ్య నిర్మాణ దక్షులవుతారు. వీరు ఔపదేశిక కవులు.

"కావ్య మీమాంస'లో రాజశేఖరుడు వీరి గురించి చెప్తూ 'మామూలు మాటలు పలికే వేగం కంటే అత్యంత వేగంగా పద్యాలు, శ్లోకాలు చెప్తారు'. కొప్పరపు సోదర కవులు ఈ శ్రేణిలోకి వస్తారు. బహుశా తెలుగులో వీరే ఇలాంటి మొట్టమొదటి కవులు. వీరు Legendary figures

ఈ మహానుభావులకిదే నా నీరాజనం.