పుట:Konda venkatappayya pantulu prathama bhaagamu.pdf/247

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


మంతట ప్రచారముసల్పి, ప్రభుత్వనకుగూడ నచ్చచెప్పగల ఆంగ్లపత్రిక యొకటి ప్రకటించుట అవసరమని పలుమారు మనవా రనుకొనుచుండిరి. ఈయుద్దేశము నెరవేర్చునిమిత్తము నేను పైనుడివిన పెద్దలనందరిని చెన్నపురిలో కాస్మాపాలిటన్ క్లబ్‌లో కలుసుకొంటిని. ముందు మేడమీదిగదులలో నున్నవారిని కలియగా వారు చాల అనుకూలముగ ముచ్చటించిరి. దిగువగదిలో నున్న ఆకెళ్ళపంతులుగారితో ముచ్చటించి వారి సహాయముతో ఈకార్యము నెరవేర్చవచ్చునని వా రపేక్షించి, వెంటనే వారిని కలుసుకొని సంప్రదించగా వారు నిరుత్సాహ వచనములు పలుకుచు తాముమాత్ర మేవిధమైన సహాయము చేయజాలమని స్పష్టీకరించిరి. అంతటితో తక్కినవారును నిరుత్సాహముచెంది యూరకుండుటచే ఆప్రయత్నము మూలబడెను.

1915 వ సంవత్సరములో కాకినాడలో మిక్కిలి వైభవముతో ఆంధ్రమహాసభ జరిగెను. దీనికి ముఖ్యముగ సహాయముచేసినవారు శ్రీ పోలవరము జమీందారులు. వీరు ఆంధ్రాంగ్లములు రెంటియందును ప్రవీణులు. చెన్నపురి శాసనసభలో సభ్యులు, ఆంగ్లభాషయందు మంచివక్తలు, ఆంధ్రభాషాపోషకులు. శ్రీ తిరుపతివేంకటకవీశ్వరు లిరువురును వీరి ఆస్థానములోనే కొంతకాల ముండి గ్రంధములను రచియించిరి. వీరు మిక్కిలి యుదారమూర్తులు. వీరిది బ్రాహ్మణసంస్థానమగుటచే వేదాధ్యయనపరులును శాస్త్రజ్ఞులునుగూడ వారిచే బహూకరింపబడుచుండిరి. ఆంధ్రమహాసభకు గొప్పగా విరాళము లిచ్చి ప్రతినిధులకు గౌరవసత్కారములను హెచ్చుగా గావించిరి.