పుట:Konda venkatappayya pantulu prathama bhaagamu.pdf/155

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గట్టిన కవితాకల్పన' యని ఆంగ్లేయగ్రంధకర్త వర్ణించియున్నాడు. పచ్చలతివాచితో కప్పబడినట్లు పచ్చికతోడను వృక్షములతోడను శృంగారముగనుండు ఉద్యానవనమధ్యమున కట్టబడియిన్నది. దీని చుట్టును ఎఱ్ఱరాతితో గట్టిన ప్రాకారము గలదు. ముఖద్వారము మహోన్నతమై, విశాలమై, సుందరముగా నున్నది. ఈ ద్వారమునుండి తోటలోనికి బోయి నిడువగు పాలరాతితిన్నెమీదుగ భవనమునకు బోవుటకు బాట ఏర్పరుప బడినది. ఈ బాట కిరుప్రక్కల వృక్షములు గలవు. బాటగానున్న ఈతిన్నె మధ్య శుభ్రజలములతో నిండి విలాసార్థముగ కట్టిన పాలరాతికాలువ గలదు. ఇందు కలువమొదలగు పుష్పములు వికసించుచుండును. ఈ విలాసకుల్యల కిరుప్రక్కల చిన్న తొట్లలో గుమ్మటములుగ పెరుగుచున్న వన్నెవన్నెల మొక్కలు కనుపండువొనర్చుచుండును. ఈ తిన్నెమీదుగ బోయి కొంచె మెత్తుగను, విశాలముగ నున్న చలువరాతి వేదిక నెక్కి యించుక ముందు నడిచి దివ్యభవనమును ప్రవేశింపవచ్చును. ఈవేదికకు నాలుగుమూలలను నాలుగు - ఎత్తును, ఎత్తునకుదగిన లావును గల చలువరాతిస్తంభములును, వానిపై అందములైన బురుజులును, పొంకము లీనుచుండును. ఈ వేదికపై నిలచి ఆ దివ్యభవనమును దర్శించినప్పుడు హృదయము మహదానందమున మునిగిపోవును. ముఖద్వారమున్న కుడ్యమున కిరుప్రక్కల గోడలు తలుపురెక్కలవలె నించుక లోపలికి వంపుదీర్చి కట్టబడినవి. వానిపై చిన్నబురుజులు ముద్దులొలుకుచున్నవి.