పుట:Konda venkatappayya pantulu prathama bhaagamu.pdf/103

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ములలోను తెలుగునకు స్థానములేదనియు బి. ఏ. పరీక్ష కొలది దినములలో జరుగనున్నదిగావున దీనిని వదలి, మరల సంస్కృతమును చదువుటకు మొదలుపెట్టి ఇన్నిసంవత్సరములు చదివిన దంతయు వ్యర్ధపరచుకొనుట దుర్భరమగు కాలహరణమునకు, దుస్సహమగు ద్రవ్యనష్టమునకును గారణమగుననియు తలంచి అవమానమునకు లోనై జరిమానాసొమ్ము పదిరూపాయలను చెల్లించితిమి. ఈసమ్మె చల్లారినపిమ్మట నన్ను, హనుమంతరావునుగూడ విద్యార్థివసతిగృహమును విడిచివెళ్ళవలసినదని ఉత్తరువుచేసిరి. అవి బి. ఏ. పరీక్ష సమీపించురోజులు. మేము ఉండుటకు తగినస్థలము దొరకుట దుస్తరముగానుండెను. కాని దైవానుగ్రహమువలన విద్యార్థివసతిగృహమునకు ప్రక్కనున్న తంబుచెట్టిగారియింటిలో నొకహాలు అద్దెకు గుదిరినది. హాలులో సోఫాలు, చలవరాళ్ళబల్లలు, పటములు ఛాండిలియరులు మొదలగు విలువగలిగినవస్తువులు రమణీయముగ నమర్చబడియుండెను. అవి యన్నియు అందుండగనే మాకు నెలకు రు 2/- లకు మాత్రమే అద్దెకిచ్చిరి. ఆయింటివారినిబట్టియే ఆవీధికి పేరు వచ్చినది. వారు ఒకప్పుడు ప్రసిద్ధులయ్యు అప్పటికి హీనస్థితిలోనికి వచ్చియుండిరి. కాని యిల్లు అద్దెకిచ్చినారని యితరులకు తెలియుట గౌరవహానిగా నెంచి, మాకు అతిరహస్యముగ అద్దెకిచ్చిరి. మరికొందరు ఆంధ్రవిద్యార్థులును మాతో చేరిరి. కొలది రోజులలో నామేడ అంతయు విద్యార్థులతో నిండిపోయెను. ఇట్లు చదువుకొనుటకును నివసించుటకును మంచివసతి దొరకినందున సంతసించితిమి. మిల్లరుగారి వసతిగృహమునుండి వెడలగొట్టబడినకొరత మా కేమియును లేకుండెను. భోజనమునకు