పుట:Konangi by Adavi Bapiraju.pdf/35

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కలిగింది. ఆ జమీందారుడు పోగానే జయలక్ష్మిని అయ్యంగారు పెళ్ళాడినంత పనిచేసి మన్నారుగుడి నుండి మదరాసు తీసుకొని వచ్చినప్పుడు ఆమె కోర్కెపైన ఈ ముగ్గురు వస్తాదులను నెలకు ఎనభై చొప్పున ఒక్కొక్కనికిస్తూ తనతో ఉండండని కోరినది. ఆమె ఆ మూడు కుటుంబాలకూ చేసిన సహాయం అంతా ఇంతా కాదు.

వారి పేరు చెపితే దక్షిణాదిన భయపడని గూండా ఒక్కరైనా లేడు. దొంగలు, రౌడీలు వారి మువ్వురి పేరులలో ఒక్కరి పేరు విన్నా 106 డిగ్రీల మలేరియా జ్వరం పట్టుకుంటుంది. ఇక మువ్వురిపేర్లూ కలిపివింటే టైఫాయడూ, న్యూమోనియా, మలేరియా, ప్లేగు, కలరా, డిసెంట్రీ, పారా ప్లేగెయా, మెనింజైటిస్, డిప్తీరియా, ఇంసోమ్నియా, గాభరేరియా అన్నీ ఒక్కసారిగా పట్టుకుంటాయి.

చెట్టిగారు వచ్చాడు అని అనంతలక్ష్మి పరిచారిక ఒకర్తె చెప్పింది. ఆ మాట వింది. ఆ బాలిక మండిపోయింది. ఆ కోపాన్న ఆ పరిచారికను అక్కడే ఆపింది. “ఒసే ఎవరు వీడు? ఈ పశువు, ఈ కుక్క ఈ నక్క ఈ పంది, ఈ పంది కొక్కు? ఎందుకు? ఎందుకు వస్తాడు మా ఇంటికి? వీడు ఈ గాడిద, ఈ కంచరగాడిద, ఈ కోతి, ఈ ఒరంగ్, ఈ ఒటాంగ్, ఈ ఎలక, ఈ చీమ, ఈ దోమ, ఈ నల్లి, ఈ పిల్లి. నాకు తీరుబడి లేదని చెప్పు పో! వెంటనే వెళ్ళి చెప్పు! వాడు నా ఇంటిలో అడుగుబెడితే నాకు జ్వరం వస్తుంది.”

“అప్పుడే అమ్మగారు మాట్లాడుతున్నారు.”

“మా అమ్మను మామియర్ (అత్తా) అంటాడు. మా అమ్మ వాణ్ణి మరుమగన్ (అల్లుడా) అంటూ పిలుస్తుంది.”

“ఏమి చేయమంటారమ్మా?”

“కారు సిద్ధంచేసి పోర్చి ఆవలగా ఉంచమను. ఈలోగా నువ్వుపోయి. ఆ ఎలుగు బంటితో నేను వస్తున్నానని చెప్పు.”

పదినిమిషాలలో అన్నీ సిద్ధం చేసుకుంది. గబగబ వెళ్ళి కారులో కూర్చుని కారును తిన్నగా ట్రిప్లికేను పోనియ్యమంది.

వీధి గేటు దగ్గరకు ఆ కారు వెళ్ళేసరికి మన చెట్టియారుగారికీ ఆ కారు కళ్ళబడింది. “అమ్మాయి ఎక్కడికో వెడుతోందే?” అని చెట్టియారుగారు జయలక్ష్మితో అన్నాడు.

“అయితే వస్తాను. ఏదో ఇవాళ అదివారంకదా, కాస్త అమ్మణితో మాట్లాడవచ్చునని వచ్చాను.” అని చెట్టియారు లేచి గబగబ వచ్చి తన “రోల్సు” కారు ఎక్కినాడు. కారుడ్రైవరుతో “ఆ కారు ఎక్కడికి వెడితే అక్కడికి పో” అని అన్నాడు.

రోల్సు ఉరికింది ముందుకు, గేటుదాటి కుడివైపుకు తిరిగింది. సిద్దహస్తుడైన డ్రైవరు చేతిలో ఆ కారు జర్రున వేగంగా సాగింది. లజ్ నుంచి రాయపేట హైరోడ్డు కలియికకడకు వచ్చేసరికి ముందు అనంతలక్ష్మి బెంట్లే కనబడింది. ముందు బెంట్లే వెనకరోలు. ఆ కారును చూచి, ఆ ముందు వెళ్ళేబెంట్లేలోని అమ్మాయిని చూచి, పడిందిరా ఆంబోతు పడ్డవెనకా లనుకున్నారు. డ్రైవరుకు వెనకాల రోలు తరుముకు వస్తున్న విషయం బీచిలో తెలిసింది. ఆ విషయం అనంతలక్ష్మికి చెప్పాడు. అలాగా! సరే ఈ పైత్యకారిని ఏడిపిద్దాము అని అనుకుని డ్రైవరుతో తిన్నగా ఎడ్వర్డు ఎలియట్సు రోడ్డుకు తిప్పి అక్కడ నుంచి తిన్నగా పోనిచ్చి గోపాలపురంలో ఉన్న తన స్నేహితురాలు ఆలమే అలుంబాన్ తండ్రి హైకోర్టు జడ్జి పార్ధసారధి మొదలియార్ గారి భవనంలోకి తిన్నగా పొమ్మంది.