పుట:Konangi by Adavi Bapiraju.pdf/34

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

ఎవరినన్నా బాలికను తీసుకువెళ్ళడానికి ఎవరో అందాలు తమ వంటినిండా కుదించుకొన్న మనోహరాంగులు రావచ్చును గనుక వారిని చూడడానికి మాత్రమే అతడు వెడతాడు. దీపాలు ఆరిపోతే బొమ్మని చూడడు. ప్రక్కను కూర్చున్న తనతో వచ్చిన బాలిక మెత్తని చేతులు తన చేతులలోకి తీసుకొని చెక్కుతూ స్పర్శ అనుభవించడం భుజాన్ని భుజం రాయడం, కాలుని కాలుతో తొక్కడం మొదలయిన శృంగార నాయకుని హావ భావ విలాస కేసులన్నీ అక్కడ ప్రయోగించి, వానివల్ల వచ్చిన అనుభవం పరీక్షించి వాటిని హృదయంగమం చేసుకోవడం ఆయన పరమాదర్శము.

సముద్రపు ఒడ్డు సౌందర్యయువతీ విరాజిత శృంగారభూమి. సభలు వివిధ విలాసయుత సుందరీ సందోహిత మందారవనాలు, నాటకాలు విచిత్రమన్మథనర్తిత రంగస్థలాలు. కాబట్టి ఈ ధనపిపాసి వానికి హాజరు. హాజరంటే ఊరికే వట్టిహాజరా? మెళ్ళో సన్నని బంగారు పొడుగాటి గొలుసు. ఆ గొలుసు చివర ఒక పచ్చ ఇరవై వేలుంటుంది. చేతులకు వున్న ఎనిమిది వుంగరాల మదింపు ముప్పదివేల రూకలు. ఆయన బట్టలు పాముకుబుసాలు. ఆయన చేతికర్ర బంగారు తలకట్టు, జాగిలాయి తల. ఆ కుక్కకు కళ్ళు కెంపురాళ్ళు. మూతికడ నీలం, పళ్ళు వజ్రాలు. కర్ర ఆసలైన సిసలైన నిఖారసైన దంతం.

చెట్టియారుగారికి ముప్పది మూడుఏళ్ళ మూడు నెలలు. నిరుడూ అంతే. ముందటేడూ అంతే. అంతకుముందు ముప్పది ఏళ్ళు, వరుసగా అయిదేళ్ళపాటు. అసలైన సిసలైన నిఖారసైన ఆయన ఈడు ఆయన జ్యోతిషం వ్రాద్దామనుకున్న రామస్వామి దీక్షితారుకే తెలుసును.

ఆ చెట్టియారుగారి రోల్స్ రాయిస్ కారు వారి ఆవరణలో నిలిచింది. అందులోనుండి దిగకుండా “చిన అమ్మాయిగా రున్నారా?” అని గేటుకీపరును చెట్టియార్ గారి చ్యాపియర్ అడిగినాడు.

“ఉన్నారు” అని వినాయగంపిళ్ళ జవాబిచ్చాడు. వినాయగంవీళ్ళకు ఈ చెట్టియారును గురించి నిండా పూర్తిగా తెలియును. అసలు వినాయగం పిళ్ళ ఉన్నదే అందుకు వినాయగంపిళ్ళ, కందస్వామి, అరుణాచలం ఈ ముగ్గురూ ఆ ఆవరణలో భార్యలతో బిడ్డలతో కాపురమున్నారు గనుకనే, చెట్టియారుగారు నెమ్మదిగా కారు దిగుతూ నవ్వుతారు, లోపలికి అడుగు పెట్టుతూ నవ్వుతారు, లోని హాలులో సోఫా కుర్చీలో చతికిలబడుతూ నవ్వుతారు.

వినాయగంపిళ్ళ, కందస్వామి మొదలియారు, అరుణాచలం నాయకరు ఒకనాడు సకల దక్షిణాపథ భీములనూ రాజ్యం ఏలారు. ఒకడు కుస్తీలో ఒక్క గామాకుమాత్రం లొస్కు రెండవ పెద్దమనిషి ముష్టియుద్దంలో జోలూయికీ బొక్కు మూడవవీరుడు బలప్రదర్శనంలో కోడిరామమూర్తికి మాత్రం కాస్త తగ్గు.

వీరు ముగ్గురూ మన్నారుగుడిలో ఉండే సమయంలో ముగ్గురకూ నెలకు అరవై చొప్పున జీతం యిచ్చి జయలక్ష్మి తనకు రక్షక వీరులుగా కుదుర్చుకొంది. ముగ్గురూ మంచివారు. తమ మల్ల ముష్టి ప్రదర్శనాలు చూపడం పోటీలకు పోవడం బహుమతులు పొందడం. అంతే వారికి తమ యవ్వనపు రోజులలో పని. ఆ దినాల్లో జయలక్ష్మికి ప్రియుడు జమీందారుడు. ఈ ముగ్గురినీ చేరదీసి అనేక విధాల సహాయంచేస్తూ వారి అభివృద్ధికి కారకుడయ్యాడు. అప్పుడే జయలక్ష్మి అంటే వారి ముగ్గురికి ఎంతో గౌరవం