పుట:Konangi by Adavi Bapiraju.pdf/296

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వచ్చేది. ఆ నిదురలో మీరు చిరునవ్వు నవ్వుతూ ఉండేవారు. ఆ నవ్వు కారణము ఏమో! నాకు చిన్న బిడ్డలా కనిపించేవారు. నా చుట్టూ చూచుకొని బ్లవుజు విడదీసి, అతిగా సిగ్గుతో కరగిపోతూ, గుండెలు కొట్టుకుంటూ ఉండగా, మీ పెదవులకు నేను తల్లిలా... ఆనించేదానను. గు-రు-వు-గారూ, నాకా సమయంలో కలిగిన ఆనందం లోకంలో యెవరికీ గ్రాహ్యంకాలేదు.”

“అవును ప్రాణకాంతా! అలాంటి కలలే నాకు రెండు మూడుసారులు వచ్చినట్లు అయింది.”

కోనంగి భార్యను పాలుత్రాగే తన ఆత్మజునితోసహా ఎత్తుకుపోయి పందిరి మంచంమీద పడుకోబెట్టినాడు.

అనంతలక్ష్మి, బాలకుడూ భర్త కౌగిలిలో సమానంగా ఒదిగిపోయారు. ఇద్దరి బుగ్గలపై ముద్దులు కురిసినవి. కోనంగి “వీడు మన తపఃఫలముసుమా అనంతలక్ష్మి!” అన్నాడు.

“గురువుగారూ! నా తపస్సుకు భగవంతుడు నాకు ప్రసాదించిన ఫలం మీరు; మీరు నాకు ప్రసాదించిన ఫలం ఈ చిట్టిబాబున్నూ! వినండీ, నిన్ననే వ్రాసుకొన్నాను ఈ పాట!

యామినీయోష పూజాఫలము

ఆమె హృదయేశుడు సుధాకరుడు నాథ!

యామినీ యామినీ కాంతుల తపఃఫలము

భూమి శాంతిని నింపు వెన్నెలలూ వెలుగూ

గురుదేవ నువ్వు నా కోటిపూజలఫలము

అరుదేరే మన తపఃఫలమయిన ఈ చిట్టిబాబూ!”

“ఓసి నా ఆత్మమూర్తీ! ఎంత మధురాతి మధురంగా వ్రాశావు. ఏమి బహుమానం ఇవ్వగలను! నువ్వే నా ఆత్మమూర్తివి. నువ్వే నా బ్రతుకువు. నువ్వేనేను.”

“నువ్వే నేను. నేనే నువ్వు” అని మధురకంఠాన పాడుతూ కోనంగి భార్యను. బిడ్డను కలిపి హృదయాన కదుముకున్నాడు.

ఓం అసతోమా సద్గమయ

తమసోమా జ్యోతిర్గమయ

మృత్యోర్మా అమృతం గమయ.



సమాప్తము