పుట:Konangi by Adavi Bapiraju.pdf/295

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఉంది. నలుగురు బిడ్డల తల్లిలా ఆమె వాణ్ణి అడ్డాల వేసుకొని పాలిస్తున్నది. ఇంకను ముగ్ధ, యోష, ఐనా తల్లి. ఆయోషా వేషంలో మాత్రం కాలేజీ బాలికలానే ఉంటుంది. పిల్లవాని యేడుపు వినబడేసరికీ నిత్యషోడవర్షయైన జగన్మాత, సుబ్రహ్మణ్య జననియైనట్లు అయిపోతుంది. ఈ ఆలోచనలు క్రమ్ముకొని రాగా కోనంగి తన భార్య పిల్లవానికి పాలిచ్చు పరమదృశ్యం చూస్తూ ఆనంద పరవశుడయ్యాడు.

ఆ బాలుడు కుడివైపు పాలు త్రాగుతూ, ఎడమవయిపు తల్లి ఉరోజంతో ఆడుతున్నాడు. ఆనందంగా పాలు తాగుతున్నాడు, పెదవులలోంచి పాలు దిజ్మాత్రంగా ప్రసరిస్తున్నాయి.

ఆ తల్లి కుడిచేయి వాడికి తలగడగా, ఉయ్యాలగా ఎడంచేత్తో వాడి పండులాంటి పిఱ్ఱలు, పాదాలు, తొనలు తిరిగిన తొడలు ఆనందంతో స్పృశిస్తున్నది. పాలుత్రాగే పిల్లవాని ఆనందంకన్న ఆరమూత కన్నులు పడిన అనంతలక్ష్మి చూపులలో ఎక్కువ ఆనందం కనిపిస్తున్నది. ఆ మాతృమత్తతార్థ నిమీలిత దృష్టులను మధ్య మధ్య అనంతం తనపై ప్రసరింపచేస్తున్నది. అందంగా తన హృదయం గతులు తప్పేటట్టు రెండు పెదవులు విడిపోగా చిరునవ్వులు ఉదయకాంతులమధ్య ఎగిరే రాయంచపిండులా తేలియాడుతున్నది.

నవోఢ అయిన తన ముద్దరాలి వక్షోజద్వయము ఏదో మహత్తరరూపం దాల్చినది. ఆనాడు కమలకుట్మలాంచల సన్నిభారుణాలయిన చుబుకాలు, ఈ దిగువ నానాగాఢవర్ణాలు సేకరించి పూర్ణత నొంది తన పూజను చూరగొంటున్నవి.

తొలుత వధువై వచ్చిననాడు అనంతలక్ష్మి చూపులు వసంతసాయంకాల నిర్మలాకాశపు లోతులు, స్వచ్చనీలకాసారనీలాలు, వేయి గులాబి పూవుల నుండి జాలువారిన మధురాలు! నేడు ఆమె ప్రథమ మాతృత్వేషణాల ఈనాడు తనపై ఆమె ప్రసరించే చూపులు నిశ్చలయామినీగాఢవినీల గంభీరాలు, మహాసముద్ర నీలాతినీలాలు, సర్వకుసుమోత్కృష్ట పరిమళాలు.

కోనంగి తన్ను ప్రణయపూర్ణ ప్రకాశితాలైన చూపులతో చూడడం చూచి, అనంతానికి సిగ్గు కలిగి పయ్యెదను సవరించుకొని, తన హృదయాన్ని, పాలు త్రాగే బాలకుణ్ణి కప్పివేసుకుంది.

కోనంగి విరగబడి నవ్వినాడు. ఆ బాలిక దగ్గరకు పరమ ప్రేమార్థ హృదయంతో పోయి ఆమె కూర్చున్న కుర్చీకడ ఆమె పాదాలకడ రత్నకంబళిపయిన కూర్చుండి, అందమై ఒకదానిపై ఒకటి వేసుకొని ఉన్న ఆమె కాళ్ళపై చేతులు ప్రసరించి, అందమయిన ఆమె పాదాలు తన రెండు అరచేతుల పట్టి వంగి రెంటిని ముద్దుకొన్నాడు.

“అనంతం, నన్ను చూసి సిగ్గుపడినావా?”

అనంతం సిగ్గుతో నవ్వుకొని ఎడంవయిపునకు బాలకుణ్ణి తిప్పి ఆ వైపున పాలిస్తూ, కుడిచేతితో కోనంగి తల తడుముతూ “మీరు కొంటెపిల్లవాళ్ళు! నన్ను అంత ప్రేమతో చూస్తూంటే, అప్పుడు నా భర్తలు మాత్రం. నేనిప్పుడు తల్లిని. అందుకని సిగ్గువేసింది గురువుగారూ!” అని వంగి కోనంగి పెదవులు గాఢంగా చుంబించి ఆ వెంటనే తన పుత్రుని బుగ్గలు ముద్దు పెట్టుకుంది.

తాను వంగి భర్త మోము దగ్గరగా తీసుకొని, అతని చెంపలకు తన పెదవు లానించి “నా సర్వస్వమయిన గురూ! వీడు నా కడుపులో పడిన కొద్ది రోజులకు కాబోలు మీరు నా ప్రక్క పడుకొని అంత దివ్యమూర్తులై నిద్రపోయే సమయంలో, నాకు మెలకువ

కోనంగి (నవల)

285