పుట:Konangi by Adavi Bapiraju.pdf/256

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఎంత చదువు చదివినా స్త్రీ స్త్రీయే! భర్తను ఊదరకొట్టి తాను ఏమిచేయాలని తన ఉద్దేశం? భర్తకూ చౌధురాణీకి ఏమీ పాపసంబంధం ఉండగలదు? ఏవో లేనిపోని అనుమానాలు కల్పించుకొని తాను బాధ పడుతోంది. కాని, ఆయన నిర్మల హృదయంతోనే తిరుగుతున్నారు. ఆయన్ను చూస్తే జాలివేస్తుంది.

ఒక వారంరోజులు నెమ్మదిగా జరిగాయి. కోనంగి ప్రయత్నంవల్ల ఏమీ ఎరుగని వానివలే నటిస్తూ సంచరించడంవల్ల అనంతలక్ష్మి భర్తతో మామూలుగా మాట్లాడేస్థితికి వచ్చింది.

ఇంతట్లో ఒకరోజున పోలీసు డిప్యూటీ కమీషనరొకాయన, మన చెట్టిగారూ, ఇంకా కొందరు పెద్దలూ, ఇరవైమంది పోలీసువారూ కార్ల నుండీ, పోలీస్ వాన్ నుండీ దిగి నవజ్యోతి కార్యాలయం అంతా సోదా చూచారు. ఏ కాగితాలూ దొరకలేదు. ఊళ్ళలో జరిగే గడబిడలను గురించి వచ్చిన ఉత్తరాలూ, పత్రికా పుస్తకాలయంలోని సామ్యవాద. జాతీయవాదాది పుస్తకాలూ పట్టుకువెళ్ళారు.

చెట్టిగారి కసి తీరలేదు. ఎన్ని విధాల చిక్కులు పెట్టాలో అన్నీ పెట్టడానికి సిద్ధమే.

పత్రికా కార్యాలయంమీద దాడి జరిగిన కొద్దిరోజులకు ప్రభుత్వంవారు నవజ్యోతి పత్రికను తమకు ఆరువేలు ధరావతు కట్టాలని కోరినారు. అందుపైన కోనంగి హైకోర్టులో ప్రభుత్వంవారి ఆజ్ఞకు పునాదియైన ఆర్డినెన్స్ చట్టవిరుద్ధమనీ, ఒకవేళ ఆర్డినెన్సు చట్టవిరుద్ధం కాకపోయినా, ధరావతు కోర తగిన కారణం లేనందున ధరావతు వసూలుచేయకుండా ప్రభుత్వంపై ఆంక్ష పొందాడు.

ఈ ధరావతు విషయంలోనూ చెట్టిగారి మహాత్మ్యం ఉందని డాక్టరు రెడ్డిగారికి రహస్య వర్తమానం తెలిసింది.

డాక్టర్: ఈ మహానుభావుడికి ఎంతకాలం నీమీద ఈ కక్ష ఉంటుందంటావు?

కోనంగి: వాడికి బుద్ధి మళ్ళేవరకు.

డాక్టర్: ఎల్లాగ బుద్ది మళ్ళడం?

కోనంగి: వాడు చేసే దుర్మార్గాలు కలశం నిండిపోవాలి, అప్పుడు వాణ్ని అవే అణుస్తాయి.

డాక్టర్: మళ్ళీ వట్టి వేదాంతాలు మాట్లాడకు!

కోనంగి: వట్టి వేండాంతాలు కావయ్యా బాబూ! సంపూర్ణమయిన శాస్త్రవాదనతో మాట్లాడుతున్నాను. పెండ్యులం నీతి ఎరగవూ?

డాక్టర్: నాకు మండిపోతుంది ఒళ్ళు, వీణ్ని సున్నంలోకి ఎముకయినా మిగలకుండా తన్నించాలి.

కోనంగి: ఆ పని మాత్రం చేయకు నాయనా!

డాక్టర్: నేనే ఎప్పుడో స్వయంగా వెళ్ళి

కోనంగి: నీ సంగతీ, నా సంగతీ అల్లా ఉంచు. ఈ మధ్య ఆ అరవ పత్రికలో మన చెట్టియారును గురించి వ్రాసే వ్రాతలన్నీ చూస్తూ ఉన్నావా?

డాక్టర్: వాడెంత అసాధ్యుడోయి ఆ సంపాదకుడు! ఆ వ్రాతలలో ఉన్న గమ్మత్తు ఏమిటంటే అవి అన్నీ నిజమే! అందుచేత చెట్టిగారికి మరీ మతి పోతోందట!

కోనంగి: ఆ పత్రిక అబ్బాయికి చెట్టియారు సంగతులన్నీ ఎట్లా తెలుస్తాయ్?

డాక్టర్: అతనికి చాలామంది గూఢచారులున్నారయ్యా. ఒక్కొక్క వార్తకు ఇంతని ఇస్తాడట. అది మరీ మంచివార్త అయితే ఏభైరూపాయలు గిల్తాయన్న మాటేనట.