పుట:Konangi by Adavi Bapiraju.pdf/257

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కోనంగి: ఎక్కడిదీ డబ్బు బాబూ?

డాక్టర్: ఆ పత్రిక అమ్మకం ముప్ఫైవేలుందోయి ఇప్పుడూ!

4

మొత్తంమీద కోనంగి హైకోర్టులో దిట్టంగా వాదింపించాడు. అయినా లాభం లేకపోయింది. నవజ్యోతి పత్రిక ఆరువేల రూపాయలు సెప్టెంబరు మొదటి వారంలో ధరావతు కట్టితీరవలసి వచ్చింది.

ధరావతు కట్టినాముకదా అని కోనంగి ఘాటుగా వ్రాయటం మానలేదు. కాని 'లా' ప్రకారం పత్రికకు ఏమీ నష్టం లేకుండానే వ్రాస్తున్నాడు.

దేశంలో కొన్నిచోట్ల ఉధృతం తగ్గింది. కొన్నిచోట్ల ఏమీ తగ్గలేదు.

కాని కోనంగి మట్టుకు స్వరాజ్యము వచ్చినట్లుగానే పని చేయడం సాగించాడు. అతని ఉత్సాహమే మధుసూదనునీ, సరోజినినీ హుషారులో ముంచింది. ఆరు అయిదు కాలములు ప్రభుత్వంవారు ఒప్పుకున్న వార్తలనే పెద్ద అక్షరాలలో వేస్తూ ఉండడం మొదలయిన గడబిడచేస్తూ ఉండేవాడు. డాక్టర్ రెడ్డికి ఈలా చేయడం ఎక్కువ ఇష్టంలేదు.

‘జాగ్రత్త కోనండీ!' అని కోనంగిని కళ్ళెం లాగుతూ ఉండేవాడు. సెప్టెంబరు రెండవవారం ప్రారంభంలో బుధవారంనాడు కోనంగి సంపాదకీయం వ్రాసుకుంటూ ఉన్నప్పుడు చౌధురాణీ కోనంగి గదిలోనికి చక్కావచ్చింది. సరోజినీ, అనంతలక్ష్మి ఏదో మాట్లాడుకుంటున్నారు. మధుసూదనుడు మొదలయినవారు రాయిటరు టెలిప్రింటరులోంచి కాగితాలు లాగి పారవేస్తూ యుద్దవార్తలు, దేశవార్తలు తర్జుమాచేయడం, చింపడం, అచ్చుకు పంపడంలో నిమగ్నులై ఉన్నారు.

చౌధురాణీ కోనంగి కడకు వచ్చి 'ఏమయ్యా బ్రదర్! ఇప్పటికి నిశ్చయానికి వచ్చాను.”

“ఏమి నిశ్చయం?” ఆదుర్దాగా కోనంగి అడిగాడు.

“నేను రెడ్డిగారిని ప్రేమిస్తున్నానని!”

“అయితే నా హృదయపూర్వక అభినందనలు.”

కోనంగి లేచి చౌధురాణీ చేయి ఆడిస్తుండగా అనంతలక్ష్మి “గురువుగారూ!”అంటూ అక్కడకు వచ్చింది.

చౌధురాణీ, కోనంగీ కరగ్రణం చేసి ఉండడం చూసింది. మాట్లాడకుండా వెలవెల పోయే మోముతో నిలుచుండి, మరుక్షణంలో ఒక కుర్చీలో కూలబడిపోయింది.

చౌధురాణీ, అనంతలక్ష్మి దగ్గరకు వెళితే “నువ్వు వద్దు. నాకేమీ బాగాలేదు, నువ్వు వెళ్ళి సరోజిని వదినను పిలు” అని నీరసంగా అంది.

వెంటనే చౌధురాణీ వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళిపోవడం తరువాయి, అనంతలక్ష్మి కాళికా శక్తిలా లేచింది. భర్తను చూచి: “ఏమండీ, మీకు నామీద ప్రేమ నశిస్తే నశించింది. గాక! మీ ప్రణయవిలాసాలు ఇంత వెల్లడిగా ప్రదర్శించకపోతే. కాస్త రహస్యంగా సంచరించలేక పోయారు? నామీద మీ కెప్పుడూ ప్రేమ లేదని ఈ మధ్యనే తెలుసుకున్నాను. నా డబ్బుకోసం ఆశించారు. నన్ను చేసుకున్నారు. అయినా నా ప్రేమ మాత్రం మీకు సంపూర్ణాంకితం చేస్తిని. నన్ను మీకు దేహమూ, మనసూ, ఆత్మా అర్పించుకుంటిని. నామీద ప్రేమలేకపోయినా, దయాంతఃకరణలు కూడా లేవా మీకు... (ఆమె పకపక