పుట:Konangi by Adavi Bapiraju.pdf/229

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

“అదేమిటండీ, ఎంత ప్రేమించినా అస్తమానమూ ప్రియురాలిని తలుచుకుంటూ కూర్చుంటారా ఏమిటి?”

“నయమే నిన్ను చదువు మానివేయమని పొద్దస్తమానాలు నా కౌగిలింతలో ఇమిడించుకు కూర్చొని ఉండలేదుగా?”

“ఏమో, మీ వ్యాపారం చూస్తే అంతపనీ చేసేటట్టే ఉన్నారు.”

“లేకపోతే ఏ ఆడవేషమో వేసికొని, నీతో కాలేజీకి రావలసి ఉంటుంది.”

“వెనుకటికి మీ వంటి ఒక నవకవి-

ఓసి ప్రియురాల! నిను వీడి ఒక్కక్షణిక

మైన మనజాల నగుట నీ మేన దాల్చు .

వలువనై కంచుకమునై భూషలునునై త్వదీయ మధుర లోచనముల దీప్తినగుదు” అన్నాట్ట.

అల్లాగే నా జడలోని పూలదండై నాతోనే రండి.”

“అలాగే అనిపిస్తుంది అనంతం! అనంతంమీద అనంతమయిన ప్రేమ గలిగిన అనంగసుందరుడైన కోనంగి ఆమె పెదవుల పైన రేకలు, కనుబొమల వంపు, గడ్డం క్రింద పుట్టుమచ్చ, అరచేతి ఎరుపు అయిపోయాడని ఈరోజు మాకు రాయిటరు వార్త వచ్చింది.”

“ఎవడావార్త పంపిన వార్తాహరుడు?” (కోపం నటిస్తూ)

“పురుషుడు కాడు. స్త్రీ ప్రత్యేక విలేఖరి!”

“ఎవరామె చెప్పండి. ఇప్పుడే తక్షణం?” (ఇంకా కోపంగా)

"ఆమె నేంచేస్తావు?”

“కౌగలించుకుంటాను.”

“పురుషుడయితే ఏమి చేసి ఉందువు?” (కంగారుగా)

“హల్లో బ్రదర్ అని షేక్ హాండ్ చేసి ఉందును!”

“వహ్వా!”

“గురువుగారూ! జపానుమీద మీరు వ్రాసిన సంపాదకీయం ఎంత బాగుందండీ! భాష బాపూజీగారి ఇంగ్లీషులా ఉంది. ఆ సంపాదకీయం మూడు సార్లు చదువుకున్నాను.”

“ఇంగ్లీషు పత్రికలకు ఇదివరకే సంపాదకుడుగా గాని, మంచి సహాయక సంపాదకులుగా గాని పేరున్నవాళ్ళే కావాలి! తెలుక్కి ఇప్పుడే సంపాదకజాతి ఉద్భవిస్తోంది. అదివరకు పేరుపొందిన సంపాదకులు ముట్నూరి కృష్ణారావుగారు, కీ.శే. దేశోద్దారక నాగేశ్వరరావుపంతులుగారు.”

“ఆంధ్రప్రభ నారాయణమూర్తిగారో?”

“వారు కొత్తగా ఉద్భవించిన సంపాదక కుమారులలో పెద్ద కుమారుడు.”

“సహాయకులుగా చాలామంది లేరుటండీ మరీ మీరు?”

“ఉన్నారు ఉపసంపాదకులు వారంతా పైకి రావలసినవారే. ఏవీ తెలుగు దినపత్రికలు?”

“మన దేశానికి ఎన్ని దినపత్రికలుండాలని మీ ఉద్దేశం?”

“తెలుగువారి జనాభా మూడుకోట్ల యాభై లక్షలు ఉంది. మూడు దిన పత్రికలు ఏంచేస్తాయి. ఆరు దినపత్రికలన్నా ఉండాలి.”