పుట:Konangi by Adavi Bapiraju.pdf/216

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


“ట్రయినింగుకు ఇచ్చే పిఠాపురం రాజావారి స్కాలరుషిప్పు దానికి అక్కడ ఉండడానికి సరిపోతుందా!”

“సరే కాని, వెంటనే నువ్వూ, నీ భార్య, చౌధురాణీ మదరాసు రండి. అక్కడ మా యింట్లో ఉందురుగాని.”

"ఛా! ఛా! నువ్వే మీ అత్తవారింట్లో ఉన్నావు.”

ఇంతట్లో అనంతలక్ష్మీ, చౌధురాణీ, మధుసూదనుని భార్యా అక్కడకు వచ్చారు. మధుసూదనుని భార్య కమలనయన “కోనంగిరావుగారూ! మీ ఆవిడ మమ్మిద్దరినీ చంపేస్తోందండీ!” అన్నది.

అనంతలక్ష్మి నవ్వుతూ “చూడండి! వీళ్ళిద్దరినీ. మధుసూదనరావు అన్నగారినీ నాలుగురోజులపాటు మదరాసుకు రమ్మంటే, అల్లరి చేస్తారేమిటండీ?” అన్నది..

“ఒరే మధూ, మీరు రాకపోతే నన్ను మరిచిపొండి, అంతే!” అన్నాడు కోనంగి.

7

చెట్టియారు మధురలో యుద్ధ పారిశ్రామిక వస్తువులను తయారుచేసే పారిశ్రామికులను తయారుచేసే పారిశ్రామిక విద్యాలయం పెట్టాడు. ప్రభుత్వ సలహా ఉద్యోగి (మంత్రుల బదులు వీరు వచ్చారు) ఒకరు వచ్చి ఆ విద్యాలయం తెరిచారు. ప్రభుత్వం కూడా సహాయం చేస్తూ ఉంది. దీనికి తగినట్లు ప్రభుత్వ సహాయంతో ఒక తమిళ దైనికపత్రిక పెట్టాడు. స్వయంగా అరవంలో అరవదేశం అంతా తిరుగుతూ యుద్ద నిధికి సహాయము చేయమనీ, యుద్దంలో చేరమనీ ఉద్భోదించసాగాడు. తాను స్వయంగా ఒకసారి లక్షరూపాయలు ఇచ్చినాడు. గవర్నరుగారు వచ్చినప్పుడు రెండులక్షల రూపాయలు నిధికి అర్పించినాడు. వైస్రాయిగారు మదరాసు వచ్చినప్పుడు నాలుగులక్షలు ఇచ్చినాడు.

దీనికంతకూ వెనకాల దిట్టమయిన ఒక మూలకారణం ఉంది. అనంతలక్ష్మీ అమృతతుల్య మందహాసమే. ఎలాగయినా, ఎప్పటికయినా ఆ మందహాసం తనకు ఆస్వాదనభోగం ఇచ్చితీరాలి! ఆ అద్బుత ముహూర్తంకోసం తాను యెంత కర్చుకైనా వెనుదీయదలచుకోలేదు.

ప్రభుత్వ స్నేహం శక్తినిస్తుంది. ఆ శక్తివల్ల మదరాసురాష్ట్రం అంతా తన వెనుక రయిలు ఇంజను వెనుక బండ్లులా వచ్చి తీరుతుంది. ఆ వచ్చే బండ్లలో ఒక మొదటి తరగతి బండిలో, చక్కని అలంకారం చేసిన దాంట్లో అనంతలక్ష్మి ఒక్కతే మన్మథుని రాణిలా తనకోసం ఎదురుచూస్తూ ఉంటుంది. తాను మన్మథుని వేషంతో దర్జాగా ఆ గదికి వెడతాడు.

అతని కన్నులు అరమూతలు పడ్డాయి. రుచిగల వస్తువును తలచుకొని పెదవులు చప్పరించే దౌర్బాగ్యునిలా చెట్టిగారు తన పెదవులు చప్పరించుకొన్నాడు.

ఇంక కోనంగి కూడా తన రైలు క్రింద పడిపోతాడు. రైలు వాణ్ణి ముక్కముక్కలుగా ఎండించి పారేస్తుంది.

ఈ ఆలోచనరాగానే చెట్టిగారు మధుర నించి చెన్నపట్నం బయలు దేరబోయే వేళ ఒక తమిళ వారపత్రిక పోస్టులో తక్కిన టపాతోపాటు వచ్చింది. ఆ పత్రికను చూచీ