పుట:Konangi by Adavi Bapiraju.pdf/214

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

“ఏమిటి అత్తాకోడళ్ళిద్దరూ మాట్లాడుకొంటున్నారు. అమ్మా! నువ్వు మాతో రావడమేనా?” అని తల్లిని ప్రశ్నించాడు.

పార్వతమ్మ “నేను రానురా! నేను మదరాసువస్తే నా జన్మ తగలబడి పోదూ!” అంది కన్నీళ్ళు నింపుకుంటూ.

6

యుద్దం వరమైంది. ఇంగ్లండును నాశనం చేయాలని జర్మనీ అతి భయంకరమయిన విమాన దాడులను సాగించింది. పాపం కోనంగి ఆ వార్త చదివినప్పుడల్లా గజగజలాడిపోతాడు. యుద్ధంలోని ఒక్కొక్క పిరంగి ప్రేలుడు యొక్క భయంకరధ్వని కోనంగి హృదయంలో భూకంపం అవుతూ ఉంది.

ఏది కోరి జర్మనీ ఈ యుద్ధంలో దిగింది? 1914వ సంవత్సరములో ఏది కోరి జర్మనీ యుద్ధం ప్రారంభించింది? ఆశ అనే మహారోగం పట్టుకుంటే ఎన్ని మందులు ఆ రోగాన్ని నివారించగలవు? ప్రపంచం అంతా మందై ఒక్క మోతాదై ఆ జబ్బు వాడి చేతులోకి వచ్చినా, ఇంకో మోతాదు కావాలని ఆ జబ్బు అల్లరి చేస్తుంది.

ఇంగ్లండుకు ఆ జబ్బు పట్టుకునేగా, అదే జబ్బు పట్టుకుని బాధపడుతూన్న స్పెయిన్ ను నాశనం చేసింది. ఇంగ్లండుకు అమెరికా, ఇండియా, ఆఫ్రికా, ఆస్ట్రేలియా, మలయా, న్యూగినియా, న్యూజిలాండు, అన్నీ మోతాదులయ్యాయి, ఈ జబ్బు గమ్మత్తు ఏమిటంటే, మందు పుచ్చుకున్న కొలదీ జబ్బు ఎక్కువౌతుంది. జబ్బు ఎక్కువైన కొలదీ మందు యెక్కువ కావాలి.

కోనంగి ఈ మహారోగాన్ని గూర్చి ఆలోచించిన కొలదీ, మరింత భయపడి పోయాడు.

“అనంతం! ఈ రోగం ఉందే భగవంతుడికో, ప్రపంచ ప్రజలందరికో మాత్రమే లొంగుతోంది.”

“మనకు కూడా పట్టుకోదుగదా ఈ జబ్బు?”

“విడివిడి మనుష్యులకూ పట్టుకుంటుంది ఈ రోగం?”

“ఇది అంటుడు రోగమా?”

“ఆ! టర్కీ నుంచి స్పెయినుకు, స్పెయిను నుంచి ఇంగ్లండుకు పట్టుకుంది. పోర్చుగల్కు తగిలింది. అక్కడ నుంచి ఫ్రాంసుకు పాకింది. ఆస్టియాకు పాకింది. ఆస్టియాతో దెబ్బలాడి స్వతంత్రం సంపాదించుకొన్న ఇటలీకి పాకింది. రష్యాకు పాకింది. ఇంగ్లండు నుంచి స్వతంత్రం సంపాదించుకొన్న అమెరికా వారికి ఈ రోగం తగిలింది. రష్యాతో దెబ్బలాడి విజయం పొందిన జపానుకు పుట్టింది.”

“సరేగాని మీ కవిత్వం మాని, యుద్ధం రోజులలో మనం చేయవలసిన పనేముందండీ! మనదేశానికి బలంలేదు. ప్రపంచంలో నైతికబలం మృగ్యమైకదా ఈ యుద్దాలు వచ్చేది. రామరామా! ఎంతమంది బిడ్డలు, ముసలివాళ్ళు, యువకులు, యువతులు నాశనం అయిపోతున్నారు! ఏ ప్రళయమో వచ్చి నాశనం అవడంలేదు. మనుష్యుని చంపడం అనే భావం ఎంత హృదయ విదారణమయిందండీ!”

“ఎలా యుద్దం చేయగలరో మనుష్యులు? చంపడం అనే భావం జంతు ధర్మానికి చెందింది. ఆ జంతువైనా, క్రూరజంతువు అనంతం!”