పుట:Konangi by Adavi Bapiraju.pdf/213

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పోయింది. ఎవరూ అడగకుండా, యజమానురాలి దగ్గరకు పోయి, “అమ్మా! మా అబ్బాయి వచ్చాడట పాడు బండి పంపించాడు. వెళ్ళి చూచి వస్తాను” అని చెప్పి గబగబవచ్చి బండి ఎక్కింది.

బండి వెంటనే బయలుదేరి బచ్చు పేట వచ్చింది. బండి రాగానే ఆమెను ఎదుర్కొనడానికి మధుసూదనరావు సిద్ధంగా ఉన్నాడు.

పార్వతమ్మగారు దిగీదిగటంతోటే లోనికి వెళ్ళి “ఏడీ కోనంగేశ్వరుడు?” అని ప్రశ్నిస్తూ మధుసూదనరావువైపు తిరిగింది. అప్పుడే కోనంగీ, అనంతలక్ష్మీ హాలులోనికి వచ్చి పార్వతమ్మగారి పాదాలకు నమస్కరించారు. అనంతలక్ష్మీ అత్తగారికి సాష్టాంగపడింది.

అనంతలక్ష్మిని చూస్తూనే పార్వతమ్మ ఆశ్చర్యంతో మునిగిపోయింది. పూర్తిగా అరవ బ్రాహ్మణ బాలికలా నగలూ అవీ. సౌందర్యవతియైన ఆ బాలిక పార్వతమ్మ కళ్ళల్లో మిలమిలలాడిపోయింది.

కోనంగి “అమ్మా! నీ కోడల్ని చూచావా? అనంతలక్ష్మీ. మా అమ్మగారు” అని అన్నాడు.

పార్వతమ్మ తెల్లబోయి చూడడమేగాని మాట్లాడలేకపోయింది.

“రండి అత్తయ్యగారూ! గదిలో కూర్చుండి మాట్లాడుకుందాం”

అని అనంతలక్ష్మి పార్వతమ్మను పిలిచింది. పార్వతమ్మ మాట్లాడకుండా అనంతలక్ష్మికీ కోనంగికీ ఏర్పాటైన గదిలోనికి పోయింది.


పార్వతమ్మ అక్కడ ఉన్న కుర్చీమీదగాని, చాపమీదగాని తివాసీ మీదగాని కూర్చోడానికి నిరాకరిస్తూ “నిలుచుంటానే అమ్మాయీ, మడికట్టుకున్నాను.” అంది.

అనంత: అత్తయ్యగారూ! మీరు మదరాసు రావాలి.

పార్వతమ్మ: నేనా, నేను మదరాసా, అమ్మయ్యో!

అనంత: అదేమిటి అల్లా అంటారు. మీ అబ్బాయిగారు పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసి బోలెడు సంపాదిస్తూ ఉంటే మీరు ఈ ఊళ్ళో వంట చెయ్యటం ఏమీ బాగాలేదండీ. నేనందుకు ఎంతమాత్రమూ ఒప్పుకోను.

పార్వతమ్మ: మీరు ఏ కులం అమ్మాయి?

ఆనంత: మేము తెలుగువాళ్ళమేనండీ!

పార్వతమ్మ: మీరు తెలుగువాళ్ళే అయి ఉండవచ్చును. కాని కులం?

అనంత: మాది హిందూమతం!

పార్వతమ్మ: అంటే, అదేం కులం?

అనంత: మేము వైష్ణవ మతస్తులం!

పార్వతమ్మ: వైష్ణవులా? అయ్యో మా వాడు వైష్ణవ బాలికను పెళ్ళి చేసుకున్నాడా?

అనంత: అత్తయ్యగారూ! మా అమ్మమ్మ బోగంది. మా అమ్మా అంతే! కాని మా తాతయ్య గారు వైష్ణవ బ్రాహ్మణుడు. మా అమ్మ వైష్ణవ మతస్తురాలు. ఆమెను ఒక రంగయ్యంగారు పెళ్ళి చేసుకున్నారు. ఆ ఇద్దరికీ నేను పుట్టాను.

పార్వతమ్మ తెల్లబోయింది. పదినిమిషాలు మాట్లాడలేకపోయింది. అనంతలక్ష్మి తెల్లబోయింది. అయినా తన భర్త తన తల్లిని గూర్చి సమాచారం యావత్తూ ఇదివరకే తనకు చెప్పి ఉన్నాడు. కాని ఇంత వెర్రిబాగుల చాదస్తపు ఆవిడ అని అనంతం అనుకోలేదు.

ఇంతలో కోనంగి లోనకు వచ్చాడు.