పుట:Kokkookamu.pdf/93

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


మాడుమొగమును, విశాలమైనకన్నులును, వినుతింపదగిన కీర్తియు, దీర్ఘమైన
బాహువులును, రాజలక్షణములచే నొప్పుటయు, మదించినయేనుగువలె నడకయు,
నిమ్మపండువలె శరీరచ్ఛాయయు, మంచిమాటలును, మర్యాద కాపాడుకొనుటయు,
చులకనయగు శరీరమును, సత్కర్మలయందును సత్యవాక్పరిపాలనమునను ప్రియ
మును, ఎదుర్కొనునెడల వీరులలో నగ్రగణ్యత్వమును బొందుటయు, పరిశుద్ధ
మగు చరితము గలిగియుండుటయు, పెద్దలచే పూజింపబడుటయు, దేవగురుపూజల
నొనర్చుటయు, ఒక్కభార్యతో నుండుటయే వ్రతముగా గలిగియుండుటయు,
ధర్మమును, సంతోషమును, విద్యయు, కలిగియుండుటయు పాంచాలజాతి
పురుషుని లక్షణములని తెలియందగినది.

దత్తుని లక్షణము

సీ.

అలసుఁడు మత్సరి యతిశయధృతిమంతుఁ
                 డల్పబలుండు మిథ్యాగుణుండు
అతిదంభయుతుఁడు విహారశీలుఁడు కామి
                 కుటిలచిత్తుఁడు రక్తకుంతలుండు
అతికృశదేహుండు వితతాధరాంగుండు
                 కూచిగడ్డమువాఁడు కుత్సితుండు
చెక్కుల వెన్నునఁ జేతుల రోమముల్
                 మొలవనివాఁడు సమున్నతుండు


గీ.

మఱపుగలవాఁడు చింతల మలయువాఁడు
కర్కశాంగుఁడు దుర్నీతి గలుగువాఁడు
కృపణచిత్తుండు మందుండు విపులకేశి
దత్తుఁ డని పల్కఁబడియె సమ్మతముగాఁగ.


తా.

సోమరితనమును, మాత్సర్యమును గలిగియుండుటయు, కొద్దిబలమును,
గుణములేమియు, మిక్కిలికపటమును, వేడుకగా దిరుగుటయం దిష్టమును, కాముకత్వ
మును, కుటిలస్వభావమును, ఎఱ్ఱనివెంట్రుకలును, మిక్కిలి కృశించినదేహ
మును, పెద్దపెదవియు చిన్నగడ్డమును కుత్సితస్వభావమును, చెక్కులను వెన్ను
నను చేతులయందును రోమములు మొలవకయుండుటయు, సాధారణమైనయెత్తును,
మఱపుజెందుటయు, కోర్కెలతో తపించుటయు, కఠినమైన అవయవములును,
దుర్నీతితో ప్రవర్తించుటయు, కుత్సితమును, మూర్ఖత్వమును, విరివియైనవెంట్రు
కలును గలవాడు దత్తుడని తెలియందగినది.

అధికాధికరణము సంపూర్ణము