పుట:Kavitvatatvavicharamu.pdf/10

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది



అవతారిక

ఈ గ్రంథముయొక్క చరిత్రము గొంతవఱకుఁ జిత్రము. తొలుత 1899 వ సంవత్సరములో, నేను చెన్నపురి క్రైస్తవ కళాశాలయందు విద్యార్థిగా నున్నప్పడు, కళాపూర్ణోదయ పఠనోత్సాహెూత్కర్షంబునం జేసి సూరనార్యుని యెడఁ గృతజ్ఞతయు, ఋణమునుండి విముక్తియు, సాధ్యమైనంతవఅకు బడయంగోరి యాత్మతృప్తికై యొుక యుపన్యాసము వ్రాసితి. అది మొట్టమొదట బహిరంగపఱుపఁ బడిన రంగము. ఆ కాలేజికిం జేరిన "యాంధ్ర భాషాభిరంజనీ" సమాజము. దీని నత్యంతముగాఁ బొగడిన వారిలో నొకఁడు సహపాఠియుఁ బరమ మిత్రుండు నగు మొండేటి బాపనయ్య. అతని వాసస్థలము రాజమహేంద్రవరము. ఆ సుకుమారచిత్తుని ప్రోత్సాహము నాహ్వానముఁ గారణముగ రాజమహేంద్రవరమునకుఁ బోయి యచ్చట నప్పడు ప్రముఖముగా నుండిన "విద్యాభివర్ధనీ" సమాజమువారి యాశ్రయమున నడుపcబడిన గొప్పసభలో నావ్యాసమును మిక్కిలి జంకుతోఁ జదివితి. అక్కడఁ దటస్థించిన వాదములం జర్చలం బట్టి చూడఁగా, నా కాలమునఁ గళాపూర్ణోదయము మంచి ప్రసిద్ధికి వచ్చియుండలేదని తోఁచినది. తెనుఁగున నవల లనఁబడు కథలఁ గల్పించుటలో నద్భుత ప్రతిభులగు శ్రీ చిలకమర్తి లక్ష్మీనృసింహము గారు ఉదారులగుట గొంచెమును బెద్దగా గణించి యామోదసూచకముగఁ దమ కృతుల నాకు సమ్మానముగా నిచ్చిరి. బాలుండనగు నాకు నట్టి వారి యంగీకార మెంతటి యాత్సుక్యము నొసంగెనో మీరే యోజింపడు. భాషాకృషికి ప్రోత్సాహకములలో వారి సంభావన ప్రథమగణ్యము. పిమ్మట నా వ్యాసము మఱి రెండు స్థలముల నివేదించితిని. అందొక దాన నగ్రాసన మలంకరించిన కవీశ్వరులు శ్రీ వేదము వేంకటరాయ శాస్త్రులుగారు. నేను అత్యుక్తిదోషము పాలైతినని మృదువచనములతో మనము నొవ్వని విధంబునఁ గొన్ని స్ఖాలిత్యములం జూపి నన్నుం గృతార్థునింజేసి నాకు నెప్పటికంటె నెక్కువగ వందనీయులైరి. నెల్లూరులో నివసించు శ్రీ దుర్భా సుబ్రహ్మణ్యంగారు నా వ్యాసముంగూర్చి ప్రశంసించుచుఁ బద్యము నొకండు వ్రాసి పంపిరి. తరువాత 1902 వ సంవత్సరమున విద్యార్థినై గవర్నమెంటు వారొసంగిన బహుమాన వేతనము సహాయముగ నింగ్లాండునకుం బోయితిని. విదేశములయందును గళాపూర్ణోదయము మఱి మఱిం