పుట:Kavitvatatvavicharamu.pdf/11

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

జూచుచుంటినిగాని వదలలేదు. వదలఁగాదు గాన. మరల స్వదేశమునకు వచ్చుటకు సుమారు 5 సంవత్సరములు పట్టెను. వచ్చియుండిన కొంచెము తెనుగన్ననో సగానికి సగము అంతర్ధాన మైనందునఁ జింతాక్రాంతుఁడనై, యే ప్రాచుర్యములు నాకేలయని యుండఁగా, ప్రస్తావవశమున నా యుపన్యాసము సంగతి వినిన అస్మత్పితృసఖుని పుత్రుఁడు వావిళ్ళ వేంకటేశ్వరశాస్త్రి దానిం బ్రకటింపగోరి తనకిమ్మని యడుగఁగా నెట్టకేలకు సమ్మతించితి. ఇంటికి వచ్చి యెక్కడ వెదకినను నా కా విమర్శనము లభించినది గాదు. దానిగతి యేమాయెనో దేవునికే యెరుక. నూతన ప్రారంభములు నావంటి యన్యకార్యమగ్నునకు దుర్ఘటములు. కాలము నిలువదు. పోవును. తరుణము సులభము కాదు. తనంతట రాదు. ఇట్లు కొన్నియేండ్లు చెల్లఁగా నేది యెట్లున్నను వ్రాయక పోరాదని పునఃపఠనమునకుం దొడంగుతఱికి నా యభిప్రాయము లనేకములు నాకుఁ దెలియకయ ఈమధ్యమునఁ బలు దెఱుంగుల మార్పులం గాంచియుండుట వ్యక్త మయ్యెను. దానిచే నుపన్యాసమునకు మాఱుగ నీ విపులగ్రంథము వ్రాయుటయుఁ గొత్తపేరిడుటయు ననివార్యము లాయెను.

ఒంటిగా నే సమర్ధించి యుండఁజాలను. నాకుం దోడుగ మైసూరు మహారాజుగారి కాలేజియం దాంధ్రపండితులగు రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మగారు నిలిచినందునఁ గార్యము నెఱవేఱెఁ గాని లేకున్న నైయుండుట సందిగ్ధము. ఇంత త్వరలో నైయుండుట యసంభవము.

తొలుతటి యుపన్యాసము వాసన యిందు నింకను నుండుట చదువరు లెఱుంగుదురు. కళాపూర్ణోదయముతోడ ప్రభావతీ ప్రద్యుమ్నమును ఆక్రమింపవలసివచ్చె. దృష్టి యొక కావ్యమునుండి యింకొక దానిపైఁ బ్రసరించియుండుట స్పష్టము. సహజవ్యాప్తినేల నిరోధింపవలయునని దాని ప్రకృతి కనర్గళసంచార మొసంగితి. గ్రంథ వైపుల్యముంగూర్చి మీ క్షమాపణ వేఁడెద.

ఈ కార్యమునకుఁ దొలుత నత్యంత ప్రోత్సాహకుఁడైన మన్మిత్రుఁడు మొండ్రేటి బాపనయ్య కీర్తిశేషుఁడగుటచే దీనిం జూచి నాపైఁ బ్రేమచేనైన సంతసింప లేమికిఁ జింతిలుచున్నాఁడ ! చిర సమీక్షచే గార్యములు నిష్ఫలము లగునుగదా ! కావున నీ చింత దురద్పష్టము గాదు. నా నేరమునకు నైనదండన.

ఇట్లు, తమ విధేయుఁడు
కట్టమంచి రామలింగారెడ్డి