పుట:Kavikokila-Granthavali-4 Vyasamulu.pdf/70

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

64

కవికోకిల గ్రంథావళి


కెక్కనిదే కావ్యములందు నీతి యావశ్యకమా? లేదా? యను సం దేహమును మనము తీర్చుకొనలేము. నీతి యనుపదమును విశాల భవముగల దానిగా నూహించి నేనిచట ప్రయోగించుచున్నాను. దేశకాల పాత్రములకు లోఁబడి నీతులు భిన్నములుగ నుండవచ్చును. ఒక సంఘమువారికి నొక దేశమువారికి ననుకూలమయిన నీతులు మఱియొకరికి విరుద్దముగఁ దోఁపవచ్చును. కాని, యిట్టి పరస్పర విరుద్దము లైన నీతులందు నంతర్వ్యాపియగు నుద్దేశ మొక్కటియే. అది యేదన : మానవ జీవితోద్ధరణము, లోకయాత్రా సౌకర్యము. నేనిచటఁ బ్రయోగించిన నీతి అను పదమును దేశకాల పాత్రాచార వ్యవహారములకు వశవర్తి యయి సంకుచితమయిన నీతినిగ నర్థముచేసికొనఁ గూడదు. అన్ని నీతులకు జన్మకారణమయిన యావశ్యకతనుగఁ దలంప వలయును. ఇది జగ దేకము,

సంఘ సమష్టికిని దదంశ మైన వ్యక్తికిని భిన్న భిన్న వ్యక్తులకును గల ప్రవర్తన సామరస్యము, ఆనుగుణ్యము నీతి యనఁబడును, ఈనీతి మానవుల యావశ్యకతనుబట్టియు ననుభవము ననుసరించియు, క్రమక్రమముగ రూపముదాల్చి సంఘయంత్రమును నడుపుచుండును. ఈ నీతులు సకల విధములైన మానవచర్యలకు సంబంధించియున్నవి. ఇట్లనుట వలన, విశేష సంఖ్యాకులగు ప్రజల యభిప్రాయము ఘనీభవించి నీతిగను శాసనముగను మాఱును. కాని, నీతి శాసనములకుఁ గొంత భేదముగలదు. రాజూధికార ముద్రగలది శాసనము, సంప్రదాయ సిద్దమయి మానవుల భావములను