పుట:Kavikokila-Granthavali-4 Vyasamulu.pdf/56

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

50

కవికోకిల గ్రంథావళి

మొదటి పద్యమున 'నయననిర్యాణమ్ము గావించుట, అనువాక్యమునందుఁ గార్యమువర్ణితమైనది. ఎంత సౌందర్యవతియైన కాంతను జూడనిదే గౌతమునికి అంతటి యానందము గలిగియుండునా! అని మన మూహించుచుందుము. కవి సూక్ష్మముగ స్ఫురింపఁ జేసిన భావములను అవలంబముగఁ గొని మనము మఱికొంత భావింప మొదలిడుదుము. అనంతర మా భావములే ఘనీభవించి మనకొక సుందర స్వరూపము పొడగట్టును. రెండవ పద్యమున శోభారాజ్యంబును నేలు రాణి' అనువాక్యమున సమష్టి వర్ణనము చేయఁబడియున్నది,

చెలువుగ వ్రాసి దిద్ది విధి చిత్తము రంజిల జీవమిచ్చెనో?
పొలుపులఁగూర్చి మానస విభూతిని గౌతుకియై రచించెనో?
మెలఁతుక మేనిఁజూడఁ బరమేష్ఠి ప్రభావము నెంచిచూడ నా
నెలఁతుక దోఁచు నొండు తరుణిమణి సృష్టియటంచు నామదిన్.

[1]

(శాకుంతలము)

పై పద్యమునం దంతయు సమష్టి వర్ణనమే. దుష్యంతుని యీమాటలవలన శకుంతల అసదృశ లావణ్యవతి యనియు లోకమోహన సౌందర్యవతియనియు మన మూహింపగలము.

పై చర్చయంతయుఁ జిత్రకారుఁడును కవియు రూపగత సౌందర్యము నెట్లు స్ఫురింపఁ జేయవలయునను విషయమునకు సంబంధించినది. కాని, చర్యను వర్ణింపవలసి వచ్చి

  1. మహామహోపాధ్యాయ వేదము వెంకటరాయశాస్త్రిగారి తర్జుమా