పుట:Kavikokila-Granthavali-4 Vyasamulu.pdf/263

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

విషాదాంతనాటకము - మీరాబాయి

257


లిక మే, స్వభావము కాదు. తాను జేయు ప్రతికార్యము నిశ్చలమును నిర్వికారమునగు మనస్సుతో యోచించి చేయునేని “ట్రాజెడి' అసంభవము. ఈర్ష్యాగ్రస్తుని చిత్తము యోగి మనస్సువలె నిర్వికారముగ నుండదు. ఆ సమయమున నెట్టి వానికిని బుద్ధి మందగించును. బంగారు జింక లోకమున నుండునా యుండదా అను వివేచనముకూడ లేదాయెఁగదా రామునకు? రాక్షసుల మాయా తంత్రములు ఆయన యెఱుఁగనివి కావు. రాముఁడా జింక నేల తరుముకొని పోవలయును? మొట్టమొదటినుండియు సీత లక్ష్మణుని భక్తివిశ్వాసముల నెఱుంగునుగదా! అతనిని శంకించి సీత యేల కర్ణ కఠోరముగ దూషింపవలయును? అంతమాత్రము తెలియదా? వారిరువురు “ నిశ్చలముగ నిర్వికారముగ " యోచించుకొని చరించి యుండిన సీత రావణాపహృతయై యుండదుగదా, దీనికి సమాధానమేమి ? కాలము కానియపుడు ఎట్టివారికైనను బుద్ధిమాంద్యము కలుగును. అట్లనుటచేత వారు స్వాభావికముగ మందబుద్ధులని చెప్పుటకు వీలుకలదా?

రాణా యధఃపతనమునకు హేతువులైన స్థాలిత్యము లేవి? _అతిలోక మనస్తత్వమును గుర్తెఱుఁగ లేని యజ్ఞానము, పౌరాణిక మతమునెడ సహానుభూతి లేక యుండుట, బావ ప్రకోపము, సంశయశీలత, అభిమానము, తొందరపాటు, అగ్బరుపైని ప్రబలద్వేషము, నిశ్చలన్యాయైక నిరతి, దృఢ సంకల్పము. వీనిలోఁ గొన్ని గాని అన్నియుంగాని కొఱఁతపడి యుండిన కుంభ రాణా జీవితము మఱియొక తీరుగా నుండి యుండెడిది.