పుట:Kavijeevithamulu.pdf/87

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


శ్రీరస్తు.

కవిజీవితములు.

3.

తిక్కన సోమయాజి.


ఇతఁడు భారతములోని పదేనుపర్వముల నాంధ్రీకరించినకవి. ఈతనివలననే యీతనివంశమును గోత్రమును జెప్పఁబడినది. అందొకటి యితనిప్రథమప్రబంధ మగునిర్వచనో త్తరరామాయణములోను, రెండవది భారతములోని విరాటపర్వములోను గాన్పించును. అందు మొదటిదానిలో :-

మ. "అమరోదాత్తమనీషి నే నుభయకావ్యప్రౌఢిఁ బాటించుశి
     ల్పమునం బారగుఁడన్ గళావిదుఁడ నాపస్తంబసూత్రుండ గౌ
     తమగోత్రుండ మహేశ్వరాంఘ్రికమలధ్యానైకశీలుండ న
     న్నమకుం గొమ్మనమంత్రికిన్ సుతుఁడఁ దిక్కాఖ్యుండ సన్మాన్యుఁడన్."

         అనియును, రెండవదానిలో :-

సీ. "మజ్జనకుండు సన్మాన్యగౌతమగోత్ర, మహితుండు భాస్కరమంత్రితనయుఁ
    డన్న మాంబాపతి యనఘులు కేతన, మల్లన సిద్ధనామాత్యవరుల
    కూరిమితమ్ముండు గుంటూరివిభుఁడు, కొమ్మనదండనాథుండు మధురకీర్తి
    విస్తరస్ఫారుఁ డాపస్తంబసూత్రప, విత్రశీలుఁడు సాంగవేదవేది."

అనియుం జెప్పెను.

పై రెండుపద్యములలో మొదటిదానింబట్టి యాలోచింపఁగాఁ దిక్కనసోమయాజి యజుర్వేదియనియు నాపస్తంబసూత్రుఁ డనియు, గౌతమగోత్రుఁ డనియుఁ దెలియుచున్నది. ఇతనితల్లిపేరు అన్న మ్మ, తండ్రిపేరు కొమ్మన్న, మంత్రిశబ్దముఁ బ్రయోగించుటంబట్టి యితఁడు నియోగిశాఖాబ్రాహ్మణుఁడు అని స్పష్టమే.