పుట:Kavijeevithamulu.pdf/78

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

66

కవి జీవితములు



నొందింప యత్నింపవలయు. అనుడు నాతిక్కనపల్కు విని ఆహా! దుర్జనుం డెవ్వఁడో యాతనిమనంబు నోనాడె. కార్యంబు దప్పె నని వా రాతనిం గాంచి యినుమునుబట్టి యగ్నికి సమ్మెటపె ట్లన్నట్టు దుర్జనుం డాడుపల్కులు గణించి దీని నందఱకును దుర్గమం బవున ట్టొనర్చితిరి. మీబోంట్ల కిది ధర్మమా? ఇంక నైన మీతొంటిపదలాలిత్యంబు గన్గొంటిమేనిఁ గృతార్థుల మయ్యెద మని ప్రార్థింపఁ దిక్కన నవ్వి వారి కిట్లనియె. ఈరెండుపర్వంబులును వేదాంతార్థప్రతిపాదికంబు లవుటంజేసి యిట్లుండ పామరజనదుర్గమంబు లగువీనిఁ బండితు లెట్లయినఁ బొందుదురు. నేను దొంటిశైలిని మరలఁ గైకొందును. అనుడు ముదితులై వారును బనివినిరి. అనంతరము సోమయాజి యశ్వమే, ధాశ్రమ వాస, మౌసల, మహాప్రాస్థానిక స్వర్గారోహణపర్వంబులు దొంటికంటెను లలితం బగువచనరచనఁ దెనిఁగించి భారతం బంతయుఁ బూర్ణంబు సేసి రాజున కిచ్చిన నాతఁ డానందాబ్ధిమగ్నుఁడై యాకవివరేణ్యు నెంతయుఁ గీర్తించి కనకాభిషేకం బొనరించి గారవించెను.

తిక్కనసోమయాజి తననాలుకం గోసికొనఁబోవుట.

ఈతిక్కనసోమయాజి భారతంబుఁ దెనిఁగించుతఱి ద్రోణపర్వంబున సైంధవవధప్రకారంబు సంజయుఁడు ధృతరాష్ట్రునకుం దెలిపె నని చెప్పుచో నొకపద్యంబు చెప్పె నందుఁ బద్యాంతంబు స్ఫురింపకుండుటం జేసి "ఏమి సెప్పుదుం గురునాథా" అని తోడన తనముందున్న కాండపటంబు ద్రెస్సి యచ్చటఁ దా నుంచినకత్తి నెత్తి యిదె నానాలుకం గోసికొనెద. నాకిత్తఱి దైవసహాయంబు లేదు. అనుడు నాతనింజూచి గురునాథుండు తత్పద్యంబు మరలఁ జదివి యిట్లనియె. నా కిం దేదియు లోపంబు గానరాదు. కురునాథుం డగుధృతరాష్ట్రునకు సంజయుండు పల్కు పల్కులుగాఁ బల్కితివి. అట్లు నా కన్వయించుటంజేసి వ్రాసితిని. నీతెగువకుఁ గారణం బేమి ? అనుగురునాథుమాటల కెంతయు నలరి హరిహరనాథుకటాక్షంబు మనకుఁ గలుగ వగవ నేల యని తిక్కన మరల గ్రంథంబు వ్రాయఁ దొడంగెను.