పుట:Kavijeevithamulu.pdf/76

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

64

కవి జీవితములు



తెత్తుము అనురాజుపల్కుల కాతఁ డిట్లనియె. మత్పితృకృపాతిశయంబునఁ గల్గిన కుమ్మర గురునాథుం డనువాఁడు మాయూర నున్నాఁడు. ఆతనిందోడ్తెం డనుడు వల్లె యని యాతనిం దెచ్చి తిక్కనకుఁ జూపిరి. దాని కాతఁ డెంతయు సంతసిల్లెను.

తిక్కనచేయుశపథములు.

అనంతరము భారతముఁ దెనిఁగింప నుద్యుక్తుండై తిక్కన తాను జేయుశపథంబు లని రాజున కిట్లనియె. నేఁ జేయుగ్రంథంబునకు హరిహరనాథుఁ దక్క నొరుల నాయకులం జేయెను. సంస్కృతభారతంబును సభాంతరంబున నెన్నండును ముట్టను. వచియించుతఱి నెన్నండును దడవికొనను. అట్లు ప్రాదవశంబున నొనరించినచో నానాలుక నీ బెడిదం బగు నడిదంబున వ్రక్కలించెద నని భయంకరంబుగఁ బల్కిన నాసభ్యులు భయ మంది యాహా! యీతఁడు సార్థకనాముండు గానోవును. వల దన నేమగునో ఊరకున్న నెటు వోయి యెటు లయ్యెడునో యని యనేకవిధంబులఁ జింతించుచుండఁ దిక్కన రాజుం జూచి సభామధ్యంబున నొక కాండపటంబు గట్టింపుఁ డందు నే నుందును, అనుడు నాతఁ డట్ల కావించె. తిక్కన తా నందుఁ బ్రవేశించి యిట్లనియె. నన్న పార్యుండు రచించిన భారతభాగంబు లిం దుండుటంజేసి యాతనికీర్తియు కృతిపతివగు నీకీర్తియు నాచంద్రార్కంబై యుండును. కావున నే నామూఁడు పర్వంబుల ముట్టక నాలవది యగువిరాటపర్వంబును దర్వాత నుండుపర్వంబులును దెనిఁగింతు ననుడు నీతనివాక్యంబుల కందఱు నలరిరి.

గ్రంథరచనావిషయము.

ఈతఁడు సంస్కృతభారతంబు సభాంతరంబున ముట్టకయే తన యిష్టదేవతాప్రసాదంబున నాశుధారను నిజవాగ్వైఖరి మెఱయ విద్వజ్జనానుమతి యగునట్లు కవనంబు నుడువ దానిని గురునాథుఁడు సభామంటపంబునఁ గాండపటసమీపంబునఁ గూర్చుండి యతిత్వరిత గతి లిఖించుచుండెను. దానిం జూచి సభాసదు లందఱును వ్యాసు