పుట:Kavijeevithamulu.pdf/690

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

684

కవి జీవితములు.

"గీ. విక్రమార్కచరిత వేడ్కతో నందిన, సిద్ధిరాజు జగత్ప్రసిద్ధరాజు
     అతని పెద్దతండ్రి యైనసూరపరాజు, పరమశైవశాస్త్రపారగుండు."

3. వెన్నెలకంటి సూరనకవి.

ఇతఁడు పై సూరపరాజకవికిఁ బౌత్త్రుఁడు. అనగాఁ బుత్రునిపుత్త్రుఁడు. ఈవిషయమై కవిచరిత్రము కొంత సంశయించి ఇతఁడు సూర్యుని మనుమనిమనుమఁ డని వ్రాసినట్లుండుటచేత నీతనివివరముం దెల్పు పద్యముఁగూడ నిట వివరించెదను. ఎట్లన్నను :_

"చ. సురచిరసద్గుణాఢ్యుఁ డగుసూరసుధీమణిసంభవుండు శ్రీ
      హరిపదసేవకుం డమరనార్యుఁడు పుత్త్రులఁగాంచె మువ్వురన్
      స్థిరతరసత్కవిత్వ శుభశీలుఁడు సూరపమంత్రి చంద్రశే
      ఖరబుధవర్యు ధీవినయకర్ముఁడు తిర్మలమంత్రిసత్తమున్."

ఈసూరకవింగూర్చి 'యాదవసేనము' అనుగ్రంథములోఁ గొంత వివరింపఁబడియున్నట్లుగాఁ గాన్పించు. ఆగ్రంథము మనకు లభ్యముకాలేదు కాని వేంకటాచలపతికవి ఆగ్రంథములోని యొకపద్యమునుమాత్రము వివరించెను. ఎట్లన్నను :_

"క. వీరలుమువ్వురిలోపల, సూరప విఖ్యాతయశుఁడు సుకవిస్తుతుఁడై
     అరయ విష్ణుపురాణము, ధీ తఁ దెనిఁగించె నధికతేజ మెలర్పన్."

ఇట్లుగా వేంకటాచలకవి విష్ణుపురాణకర్తపై యితరగ్రంథకర్తల యభిప్రాయముం దెలిపి యిఁక తన యభిప్రాయముగా నీక్రిందిపద్యము వివరించె. ఎట్లన్నను :_

"సీ. సూరప కాంతిచే సూర్యప్రకాశుండు, వేదాదివిద్యల వెలసినాఁడు
      విష్ణుపురాణంబు వేడుకఁ దెనుగించి, విమలయశంబున వెలసినాఁడు
      రావూరిబసవన్నరమణతో నిచ్చిన, యల మొగుళ్లూరగ్రహారమందె
      వెలుగోటితిమ్మభూవిభునిచేఁగొనియెఁదా, నాందోళికాఛత్ర మగుపదవిని

తే. కవితపుట్టిల్లు వెన్నెలకంటియిల్లు, ననెడుపౌరుషనామధేయంబు నిలిపె
    సరసగుణములు గలిగినసాధుసుకవి, మాననీయుఁడు సూరనామాత్యవరుఁడు."

ఇట్లుగా వివరింపఁబడి యుండుటచేత నీసూరనకవి రావూరి బసవరెడ్డి సభలోనేకాక వెలుగోటి తిమ్మభూపాలుని సభలోఁగూడ