పుట:Kavijeevithamulu.pdf/689

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

వెన్నెలకంటి వేంకటాచలము.

683

ఇట్లుగా వివరింపఁబడిన పైవంశమువారిలో (1) మొదలు (9) వఱకుఁ గలపురుషులచారిత్రము వివరింపవలసియున్నది. ఈవంశములోఁ గవులు పెక్కం డ్రుండుటంబట్టి వీరిచారిత్రమును, మీఁది కాలీనులచారిత్రమును ముఖ్యముగాఁ దెలియవలసిన దై యుండుఁగావున నే నీక్రింద దాని న్వివరించి చూపెదను.

1. వెన్నెలకంటిసూర్యుఁడు.

ఇతనింగూర్చి వివరించుచో నీకవి విక్రమార్క చరిత్రములో నితనివర్ణనయున్న పద్యమునే విక్రమార్క చరిత్రములోని దని వివరించె. ఆపద్య మెట్లున్నదన :_

"ఉ. వెన్నెలకంటిసూరయ వివేకవదాన్యుఁడు వేదశాస్త్రసం
      పన్నుఁడు రెడ్డివేమనరపాలునిచేత మహాగ్రహారముల్
      గొన్నకవీంద్రకుంజరుఁ డకుంఠితతేజుఁడు పెద్దతండ్రి యౌ
      జన్నయసిద్ధధీమణికి సంతతదానకళావినోదికిన్."

ఇట్లున్నదీనింబట్టి విక్రమార్కచరిత్రముఁ గృతినందిన జన్నయ పెద్దనమంత్రి కితఁడు పెద్దతండ్రియైనట్లుగాఁ దేలినది. ఇతఁడు గొప్పకవి యనియు నితఁడు రెడ్డివేమరాజువలన మహాగ్రహారాదుల నందె నని తేలినది. దీనిలో వివరింపఁబడిన రెడ్డివేమన యెవ రనుదాని నాలోచింప వలసియున్నది. అపేరు గలప్రభువులు రెడ్లలోఁ బెక్కం డ్రుండుటంజేసి ఆవివరము దీనిలోఁదేలదు. ఇతనింగూర్చి విష్ణుపురాణములో వివరించి యున్న పద్యముంగూడ నిట వివరించి అనంతర మితనివృత్తాంత మరయుటకుఁ గోరెదను. ఆపద్య మెట్లున్న దనఁగా :_

"ఉ. ఈ నిఖిలంబు మెచ్చ నమరేశ్వరదేవుఁడు చూడఁ గృష్ణవే
      ణీనది సాక్షిగాఁ ననికి నిల్చినరావుతుఁ గేసభూవిభుం
      గానకుఁ దోలి వెన్నడచి కాచినవేమయయన్న వోతభూ
      జూనికి సత్ప్రబంధము లొసంగినవెన్నెలకంటివారిలోన్,"

2. జన్నయసిద్ధయ.

ఇతఁడు విక్రమార్కచరిత్రముఁ గృతినందినవాఁడు ఇతనింగూర్చి యీ వేంకటాచలకవి యీక్రిందివిధంబునఁ జెప్పుచున్నాడు. ఎట్లన :_