పుట:Kavijeevithamulu.pdf/653

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

బమ్మెర పోతరాజు.

647

మాటయే నిజమేని దానికారణ మూహింతము. దానికొకకారణ మూహింప దగియున్నది. అదిప్రాచీనులలోఁ బెక్కండ్రకుఁ గలసామాన్య గుణవిశేషమై యున్నది. ఏమియనగా సింగమనీఁడు కేవలము సంస్కృత భాషాభిమాని భాగవతము కేవలరహస్యార్థప్రతిపాదక సంస్కృతగ్రంథము కావున దానిని పురాణకవులు వదలిరి. అట్టిగ్రంథమును దెనిఁగించుపోత రాజున కా కాలములో నెంతమంచియుద్దేశమున్నను భాగవతము దెనిఁగించు టనునది సంస్కృతాభిమానుల కందఱకు మిగులఁ గోపకారణముగా నుండకపోదు. అట్టిపండితు లుత్సహింపఁ జేయఁగా గనలినట్టియుఁ దాను స్వయముగా సంస్కృ తాభిమానియు నగుసింగమనీఁడు ప్రభుఁడై యుండుటంబట్టి, దుష్కార్య మని తా నూహించుదానిని నివారింపయత్నించుట కేల సంశయించును? కావునఁ దనయుద్దేశానుసారముఁగా బోతనకృత మగుగ్రంథము నశింపఁ జేయఁగోరి యప్పటికిఁ దోఁచినవిధముగ నాగ్రంథంబు భూస్థాపితము జేయించియుండును. అతఁడు ప్రభుండుగావున నాతనియాజ్ఞ చెల్లక తప్పదాయె. దానిం జరిగించిన పిమ్మట నాగ్రంథమందును, కవియగు పోత రాజునందును నభిమానము గలవారు దానిని రహస్యంబుగనైనఁ బయటికిఁ దీసి సింగమనీనికాలములోఁ దిరుగ దాని వ్యాపింపఁ జేయక యుంచవచ్చును. అతని యనంతర మతనిశిష్యు లాగ్రంథమున కనేకప్రతులు వ్రాసి వాని నొక్కమాఱుగ దేశమునం దంతట వ్యాపింపఁ జేసి యుండవచ్చును. ఇట్లైన భాగవతగ్రంథముద్రణకర్తలు వ్రాసినదానిలోఁ జాలభాగము యథార్థముగానుండె నని తలంచవచ్చును. అటుగానినాఁడు రెండుకథలును విశ్వాసపాత్రములు కాక చెడును. ఇట్లున్న పై వ్యాసముం జూచిన పిమ్మటనైన "భోగినీదండకము" సింగమనీని కోర్కె పైఁ బోతరాజువలన రచియింపంబడి, యాతనికిఁ గృతియీఁ బడె ననుమాట పూర్వపక్షమతములోనిదిగాఁ బాఠకులు భావింతు రని నమ్ముచున్నాఁడను.