పుట:Kavijeevithamulu.pdf/649

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

బమ్మెర పోతరాజు.

643

దానిం జేసికొనుటకై అతనిపై రెండర్థములు కల్గునట్లుగాఁ బద్యములు చెప్పి, దానిలోనిసర్వజ్ఞశబ్దము గలపద్యములోఁ జేసినయపహాస్యాదిక మిదివఱలో శ్రీనాథకవిచరిత్రములో నావలన వ్రాయంబడినది. ఆకథ శ్రీనాథుఁడు సింగమనీఁడును సమకాలీను లని చెప్పుటకుఁ జాలునుగాని శ్రీనాథకవి సింగమనీనియాస్థానపండితుఁ డని సూచింపదు. అటువలెనే కూచిమంచి తిమ్మకవి చెప్పిన పద్యమును భాగవతములోఁ బోతరాజు చెప్పిన 'ఇమ్మనుజేశ్వరాధముల కిచ్చి' అనుపద్యము పోతరాజు సింగనీని కాలీనుఁ డని తెల్పినను సింగమనీని పైఁ గృతియిచ్చి భోగినీదండకము చెప్పె ననుమాటను పూర్వపక్షము చేయుచున్నది. వీనికిఁ దోడుగా భోగినీదండకము చివర నున్న యీక్రిందిపద్యము మఱియొక పెద్దయనుమానమును కల్గించుచున్నది. ఆపద్య మెట్లన్నను :-

"ఉ. పండితకీర్తినీయుఁ డగుబమ్మెరపోతన యాసుధాంశుమా
      ర్తాండకులాచలాంబునిధితారక మై విలసిల్ల భోగినీ
      దండకమున్ రచించె బహుదానవిహర్తకు రావుసింగభూ
      మండలభర్తకున్ వినుతమానవ నాథమదాపహర్తకున్."

ఇ ట్లున్నపద్యమున పండితకీర్తనీయుఁడ నని బమ్మెరపోతన పై దండకమువంటిచిన్నవ్రాఁతకుఁగా నింతబిరుగాంకితము వేసికొని యింతగా ఆత్మస్తుతి చేసుకొనునా? యనియు నిది యొక గొప్పయంశ మని దీనికిఁగాను సర్వజ్ఞసింగనీనివంటి మహాపండితుఁడు కృతిపతిగా నుండఁగోరి పోతరాజువంటి వై రాగ్యసంపన్నుని అట్టి కవిత్వము చెప్పుట కుత్సహింపజేయుట కల్గునా యనియుఁ దోఁచుచున్నది.

సర్వజ్ఞసింగమనీనివంశస్థులే యగు మఱియొకకుటుంబమువారు గోదావరీ మండలములోని పిఠాపురములో నున్నారు.వారిగృహనామము రావువా రని వ్యవహరింపబడును. వారిలోఁగూడ నొకసామంత సంస్థాన మున్నది. వారు తమవంశావళిం బ్రకటించుచుఁ దమపూర్వుఁ డగు పై "సర్వజ్ఞసింగమనీని" వృత్తాంత మీక్రిందివిధమునఁ గొంత వ్రాసినారు. -