పుట:Kavijeevithamulu.pdf/57

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వేములవాడ భీమకవి

45



బట్టి విద్వాంసులచే నీయఁబడినబిరుద మయి యున్నది. ఈ ప్రభునకు సంస్కృతమునఁ గావ్యనాట కాలంకారములలోన నద్భుతమగు పాండిత్యము గలదని యీతనిచే రచియింపఁబడిన సింగభూపాలీయమును, రూపకపరిభాషయుఁ జూచిన గోచర మగును. ఇతనియాస్థానము విద్యాస్థాన మనియు, నితనిదగ్గర మెప్పువడయుట తన కెట్లు తటస్థించు ననియు, శ్రీనాథునియట్టి కవీశ్వరుఁడు జంకి తాను సింగమనీనిసభకుం బోవునపు డీక్రిందిపద్యమును సరస్వతిం బ్రార్థించుచుఁ జెప్పెను.

సింగమనీనిసర్వజ్ఞత్వస్థాపన కది మిక్కిలి ప్రామాణికవచనమై యుండును గావున దాని నీక్రింద వివరించెదము.

సీ. దీనారటంకాలఁ దీర్థమాడించితి, దక్షిణాధీశు ముత్యాలశాల
   పల్కుతోడై తాంధ్రభాషామహాకావ్య, నైషధ గ్రంథసదర్భముంకుఁ
   బగులఁగొట్టించి తుద్భటవివాదప్రౌఢి, గౌడడిండిమభట్టుకంచుఢక్క
   చంద్రశేఖరుక్రియాశక్తి రాయలయొద్దఁ, బాదుకొల్పితి సార్వభౌమబిరుద

గీ. మెటుల మెప్పించెదో నన్ను నింకమీఁద, రావుసింగన్నభూపాలు ధీవిశాలు
   నిండుకొలువున నెలకొని యుండి యిపుడు, సరససద్గుణనికురంబ శారదాంబ.

ఈశ్రీనాథుఁడు సంస్కృతములోని విద్యానౌషధ మగునైషధమును, నయఃపిండ మని ప్రసిద్ధి కెక్కిన కాశీఖండమును దెనిఁగించి యాంధ్రగీర్వాణసాహితీ సార్వభౌముఁ డని రాయలయాస్థానమున బిరు దందినవాఁడు. అట్టి శ్రీనాథునకు దురవగాహ మగుసాహిత్యాదులు గలసింగమనీనికి సర్వజ్ఞబిరుదు జెల్లిన నేమివింత యున్నది ? ఇతని గ్రంథములును నితనియితరవిశేషాదికములును రావువంశచారిత్రములో యథోచితస్థానంబునఁ బ్రకటించెదము.

60. వెలిగొడుగురాయఁడు - ఈబిరుదు శ్వేతచ్ఛత్రమును బట్టించు కొనుటచేఁ గలిగినది.

61. నాగార్జునకోటనికటప్రకటవికటావశియోబళ రాజరాజీవగజరాజు - అనుబిరుదావళి యోబళరాజును జయించుటచేఁ గల్గినది.