పుట:Kavijeevithamulu.pdf/58

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
46
కవి జీవితములు

62. వేంకటగిరిపురనిర్మాణాలంకర్మీణ - అనుబిరుదు తన్నా మకపట్టణనిర్మాణమువలనం గల్గినది. ఇది కట్టినపిమ్మట నిందుండు ప్రభులకు వేంకటగిరివా రనియును, సంస్థానమునకు, వేంకటగిరిసంస్థాన మనియు నామంబులు గల్గినవి. వెలుగోటివా రనుగృహనామము ప్రాచీన మగుటం జేసి యానామము గ్రంథస్థముగఁ గాన్పించును.

63. సారెయోబళరాజరాజ్యస్థాపనాచార్యబిరుదు. ఇది సారెయోబళరాజునకుఁ బోయినరాజ్యమును మరల నిప్పించుటచేఁ గల్గెను.

64. కవికల్పద్రుమబిరుదు - ఇది భానుమతీపరిణయమును గృతినందినరాయప్పనాయనికిఁ గల్గి యున్నట్లుగా నాగ్రంథములోఁ గాన్పించు. ఈరాయప్పనాయనికిం గలబిరుదులు మఱికొన్నిటిని గూడఁ జేర్చి యొకపద్య మాగ్రంథమునందు వర్ణింపఁబడినది. దాని నీక్రింద వివరించెదము.

సీ. ఘనజయశ్రీభావకలిమి నెవ్వనివీర, నారాయణాంక మున్నతి వహించు
   హితమహానందచిత్తతఁ దాల్చి యెవ్వాని, గండగోపాలకాంకంబు మెఱయుఁ
   దతసింహబలసమున్నతిచేత నెవ్వాని, యాహవభీమాంక మతిశయిల్లు
   సకలార్థసంధానచాతురి నెవ్వాని, యర్థి మందారాంక మమరి యుండు

గీ. నతఁడు నుతిఁ గాంచు రాయచౌహత్తిమల్ల, రాజవేశ్యాభుజంగ ధరావరాహ
   గాయగోవాళకేళాదిరాయబిరుద, రమ్యగుణహారి వెలుగోటిరాయశౌరి.

అని యిం దుదాహరింపఁబడినబిరుదు లెవ్వి యన అ వీరనారాయణ. 2. గండగోపాల. 3. అహవభీమ. 4. అర్థిమందార. 5. రాయచౌహత్తి మల్ల. 6. రాయవేశ్యాభుజంగ. 7. ధరణీవరాహ. 8. గాయగోవాళ. 9. కేళాదిరాయ అని మఱియొకచో హిందురాయసురత్రాణుఁ డనియు నున్నది. ఇట్టిబిరుదులు సంపాదించిన రాయప్పనాయనికాలము నిర్ణయింప నాధారములు తగినవి దొరకుట లేదు. కొన్ని కొన్ని దృష్టాంతములచే నితండు శాలివాహన సం. 1550 గలకాలమున నున్నట్లు కాన్పించును.