పుట:Kavijeevithamulu.pdf/294

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

288

కవి జీవితములు

చనిపోవుసరికి నతనికాలములో నతనికి దాతలుగా నుండు ప్రభువు లందఱు చనిపోయి యుండి రనియును, అందుచేత నతఁడు బ్రతికి యుండఁ గూడ దని చెప్పిన ట్లున్నది. అ ట్లుండునా యని యూహింప వలసి యున్నది. ఇందఱు ప్రభువులు గతించువఱకు శ్రీనాథుఁ డున్నాఁ డనఁగ శ్రీనాథుఁడు విశేషకాలము జీవించియుండు నని చెప్పుట కీపద్యము కల్పింపఁబడినట్లు కాన్పించుగాని యిది యథార్థ మని చెప్పుటకుం జాలదు. కవి కొకపుడు దాత లున్నారు ఒకప్పుడు లే రని యూహింపఁబని యుండదు. కొందఱు దాతలు గతించినను క్రొత్తదాత లేర్పడకపోరు. పై రెండుపద్యములును కల్పితములే యయి యుండిన నిఁక నతని నిర్యాణకాలముం జెప్పుటకుఁ దగినయాధారములు మఱియేవి యున్నవో వానిని మనమారయవలయును. ఆపని యిప్పటికిఁ జేయంజాలము గనుక నింతటితో నీవృత్తాంతము నిల్పియుంచెదను.

శ్రీనాథునిసమకాలీనుఁ డగు రాయ లెవ రని.

పై రాయలసంస్థానమునకు శ్రీనాథునికాలములో నధికారియెవ్వ రని యొకశంక పొడముచున్నది. ఆశంకఁ దీర్చుటకుఁ గాను దండ కవి వెలోఁ జెప్పంబడియున్న రాయలపేరుంగూర్చి విచారింపవలసియున్నది. అందుఁ గృష్ణదేవరాయ లని యున్నది. ఇంతియ కాక యీకృష్ణరాయలే కొండపల్లి కొండవీడు మొదలగు దుర్గములం జయించి గజపతికూఁతుం బరియణంబై సింహాచలములో జయ స్తంభములు వేయించి తిమ్మరసు మంత్రితోఁగూడి రాజ్యపరిపాలన చేసిన కృష్ణరాయలే యనియుం జెప్పంబడి యున్నది. శ్రీనాథునికాలము శా. స. 1350, సమీపకాల మవుటచేతను, ఇదివఱలో స్థిరపఱుపఁబడినచారిత్రాంశములన్నియు దీనివలనఁ దాఱుమాఱుగాఁ జేయంబడుఃను. కాని దీనికి సహాయముగాఁ గృష్ణరాయనిర్యాణముంగూర్చి చెప్పంబడియున్న యొకపద్యము కానుపించుచున్నది. ఆపద్యము నీక్రింద వివరించి దాని కెట్లు సమాధానము చెప్పవలయునో ఆలోచించెదము.