పుట:Kavijeevithamulu.pdf/251

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీనాథుఁడు.

245

శ్రీనాథకృతము లగునాంధ్రగ్రంథములలోఁ గాశీఖండము పురాణములలో మిక్కిలి కఠినమై "కాశీఖండ మయఃపిండ"మ్మని విఖ్యాతి గనిన గ్రంథమునకుఁ దెలుఁగు. నైషధము సంస్కృతకావ్యములలో నారికేళపాకంబున నొప్పి "నైషధం విద్వదౌషధ" మ్మనువిఖ్యాతిం గాంచిన దై యుండును. ఇట్టిగ్రంథద్వయము నాంధ్రీకరించుటకుఁగాను శ్రీనాథునకుఁ బూర్వు లగువా రెవ్వరును యత్నింపరైరి. అతనియనంతర కాలములోనివా రాయాగ్రంథములం జూచినపిమ్మటఁ దామట్టి ప్రయత్న మంతకంటె విశేషముగాఁ జేయలే మనుతలంపుతో నట్టియుద్యమమును వదలుకొనిరి. ఇట్లుగా నున్నగ్రంథముల రెంటిని నతిప్రాగల్భ్యముతో నీశ్రీనాథుఁడు తెనిఁగించెను. ఆగ్రంథము లాంధ్రీకరించిన విధ మంతయును ముందుముందు వివరించెదను.

శ్రీనాధకృతగ్రంథములవివరము.

శ్రీనాథుఁడు తాను రచియించిన గ్రంథములలో నావఱకుఁజేసిన వానిలో ముఖ్యము లగువానిని నైషధములోపలను, భీమఖండములోపలను, గాశీఖండములోపలను నీక్రిందివిధంబున వివరించె అందు నైషధములో :-

క. జగము నుతింపఁగ జెప్పితి, ప్రెగడయ్యకు నాయనుంగు పెద్దనకుఁ గృతుల్
    నిగమార్థ సారసంగ్రహ, మగునాయాచార్యచరిత మాదిగఁ బెక్కుల్.

భీమఖండములో మఱికొన్ని గ్రంథములు రచియించినట్లుగాఁ జెప్పె. ఎట్లన్నను :-

గీ. ఐనమరు చ్చరిత్రంబు నైషధంబు, సప్తశతి పండితా రాధ్యచరిత మనఁగఁ
    గావ్యములు పెక్కు చెప్పియుఁ గాంక్ష చనక, వెండియును గావ్య మొకటిగానింపఁదలఁచి.

కాశీఖండములో మఱికొన్ని గ్రంథములు రచియించినట్లు చెప్పియున్నది. అందుఁ బైగ్రంథములలోఁ బెక్కులు చేర్చఁబడినవి. ఎట్లన్నను :-

"సీ. చిన్నారిపొన్నారి చిఱుతకూఁకటినాడుఁ, రచియించితి మరుత్తరాట్చరిత్ర
    నూనూఁగుమీసాలనూత్న యౌవనమున, శాలివాహనసప్తశతి నొడినితి