పుట:Kavijeevithamulu.pdf/215

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తెనాలి రామకృష్ణకవి.

201



లోపల సాక్షాత్కరించి నీకోర్కుల నెల్ల సాఫల్యము నందించు. నాకు నిర్యాణకాలము సమీపించినది. నాతో నీమంత్ర మంతము నందును. తనచే నభ్యస్తం బగువిద్య నొరుల కెఱింగింపక తనతో నంతంబు నొందింపఁ బ్రహ్మరక్ష స్సగు నని శాస్త్రము గలదు. కావున నీవు దీని విఫలంబు గాకుండ నుపాసించి మను మని తన్మంత్రము ససాకల్యముగ నుపదేశ మిచ్చెను.

కాళిదేవి ప్రత్యక్ష మగుట.

అనంతరము రామకృష్ణుం డామంత్రప్రభావం బెంతమాత్రమో చూత మని యానాఁటిరేయిఁ గాళీదేవళంబులోనికిం జని యెంతయు నియమమున నాపె నుపాసించిన, నాదేవి భక్త పరాధీన గావున నాతనికి సాక్షాత్కరించినది. ఆట్లావిర్భవించినభవానిం గని రామకృష్ణుండు కింకరుండ నని యంజలి యొనర్చి వినమ్రుండై యుండఁగా నాదేవి కరుణించి తనవామదక్షిణకరంబుల మెఱుయుచున్న స్వర్ణ రజతపాత్రంబులం జూపి యిందొకదానిలోఁ బెరుఁగు, నింకొకదానిలో బాలు నున్న యవి. వానిం గ్రోలినవారలకుఁ గ్రమంబున విద్యయు. నైశ్వర్యంబును జేకుఱును. అని తనహస్తంబుల నత్తుకొని యున్న చషకయుగంబుఁ జూపి నీ కిం దెద్ది వాంఛితంబో వేఁడు మనుడు, రామకృష్ణుం "డమ్మా ! నాకు వీనియందలివిశేషంబు లేర్పరింప రాకున్నవి. చూచికొన నిచ్చెదవేని కల తెఱం గెఱిఁగింతును" అని యా రెంటి గైకొని యొక్కపరి వానిలోని దధిక్షీరంబులఁ దనగొంతునం బోసికొని మ్రింగి "అమ్మా! రెండును రుచ్యంబులే కావున నా రెంటింగూడ నుంచితిని గినియకు మా "యని నవ్వెను. దానికిం గనలి శర్వాణి "యోరీ నాయాజ్ఞోల్లం ఘనంబుఁ జేసితివి.

కావున నీవు విద్వాంసుండ వయ్యును వికటకవి వగుదువు పొమ్మని శాపంబిచ్చెను. అపుడు రామకృష్ణుఁడు "తల్లీ ! నా యజ్ఞానంబు సైఁపుము. తనయుని తప్పులు తల్లి మన్నింపకున్న నిఁక వానికి శరణ