పుట:Kavijeevithamulu.pdf/188

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

174

కవి జీవితములు

కృష్ణరాయలు గతించినపిమ్మటఁ గటకాధిపుఁ డగుగజపతి విజయనగరము (ఆనేగొందిపై) దండెత్తి వచ్చి తత్పట్టణసమీపములో విడిసెను. దానికిఁ బ్రజలందఱును మిగుల భయముపడఁ దొడగిరి. అది చూచి పెద్దనామాత్యుఁడు గజపతికడకుం బోయి యీ క్రిందిపద్యమును జదివె నెట్లన్నను :-

సీ. రాయరాహుతుగండ రాచయేనుఁగు వచ్చి యారట్లకోట కోరాడునాఁడు,
   సమ్మెటనరపాలసార్వభౌముఁడు కంచుతలుపులఁ గరుల డీకొలుపునాఁడు,
   సెలగోలసింహంబు చేరి ధిక్కృతిఁ జేసి సింహాద్రిజయశిలఁ జేర్చునాఁడు,
   గడికోటమారాజు గండపెండేరంబుకూతుఁ నొడంబడఁ గూర్చు నాఁడు.

గీ. నొడ లెఱుంగవొ చచ్చితో యూర లేవొ, చీరఁ జాలక తొలఁగితో జీర్ణ మైతో,
   కనడరాజ్యంబు చొచ్చితే గజపతీంద్ర, తెఱచినిలు కుక్కసొచ్చిన తెఱఁగుగాను.

అనునీపద్యమును విని గజపతి సిగ్గుపడి తాను గారణాంతరమున వచ్చితిం గాని వేఱు కా దని చెప్పి తనదేశమునకుఁ మఱలె నని ప్రతీతి గలదు.

కృష్ణరాయునియల్లుం డగురామరాజు రాజ్యము చేయుతఱి నొక వెలయాలు మైసూరుదేశమునుండి వచ్చినది. దానివిద్యావిశేషములకు రామరా జెంతయు నలరి దాని నచ్చోఁ దనకుగా నిల్పుటకు యత్నించెను. ఆవృత్తాంతము కృష్ణరాయునికూఁతురు విని యట్టిపని నివారింపఁ బెద్దనకు వర్తమానము పంపినది. అతఁడును దగుసమయముం జూచుచుండెను, ఇట్లుండ రామరా జొకదినమున సభ చేయించి యా వెలయాలివిద్యం బరీక్షింప నిర్ణయించి పెద్దన మొదలగు పెద్దల రావించెను. అట్టివిద్వత్సభలో నాగణికాశిఖామణి గానంబునం గల తనప్రావీణ్యముం జూపి సభికులమనంబు నలరించినది.

దానికి రామరా జెంతయు సంతసించి పెద్దనదిక్కు మొగంబై జాణగానచమత్క్రియల వర్ణించి సభను నానందింపఁజేయు మనుడు బెద్దన సకరుణంబుగా నిట్లనియె. "ఓరాజేంద్రా నేను గృష్ణరాయఁడు