పుట:Kavijeevithamulu.pdf/186

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

172

కవి జీవితములు



నొకదినంబున ఱేనిం బ్రార్థించి తనయిష్టానుసారముగా నొకకార్యము నడపుఁడనియె. దానికి రాజు సమ్మతించి యేమికార్య మనుడు నిట్లనియె. "చమత్కా రార్థముగమనయాస్థానములోని కొందఱుకవులను మీయాజ్ఞ యని తెల్పి సభకు రాఁగూడ దని నుడివెదను, ఇదియ నాయభీష్టమనియె, దానికి రాయఁడును సమ్మతించెను అపుడు భట్టు సభలో నిలిచి కొందఱి నామములు జదివి వీరిని ప్రభుఁ డాస్థానమునకు మఱల రా నుత్తరం బిచ్చువఱకు వీర లిచటికి రావల దని తెల్పి యిదియు రాజాజ్ఞయే యనియె. రాజాజ్ఞయనుటంజేసి యలంఘనీయము గావున వల్లె యని వారందఱును నాస్థానంబు వాసి చనిరి. వారిలోఁ బెద్దన మొదలగుకవు లుండిరి. వీరందఱును గారణం బేమియు లేక రా జిట్లాజ్ఞ యొసంగుటకుఁ జింతించి యిది భట్టుచేత నైనదే కాని యింకొకటి కాదని నిశ్చయించి ముక్కుతిమ్మనయింటికిం జని యచ్చోఁ గూర్చుండి భట్టుచెట్టలు దలంచుచుండిరి. ఇట్లుండఁ గొంతతడవునకు భ ట్టందలం బెక్కి యావీథింజనుచుండె. తిమ్మనవాకిట నున్నకవికోటి యీతనికి దృష్టిగోచరంబయ్యె. వారింజూచి నిజప్రభావము వర్ణించికొని మాధవుం డనుతనభటునిం బిలిచి యిట్లనియె :-

    "వాకిటి కావలితిమ్మన, వాకిటకవికోటి మాధవా కిటికోటే"

అని నగిన విని పెద్దన కృద్ధుండై యద్దిరే భ ట్టెట్టికాఱు లఱచుచున్నాఁడు ! చూడుఁడు ? వీనికండక్రొవ్వు. మాటలో నైన వీనికి మనము చాల మని తలంచుచున్నాఁడు. తగునుత్తరం బిచ్చెదంగాక యని లేచి యెలుఁగెత్తి యాతని నుద్దేశించి :-

"క. ప్రాకృతసంస్కృతఘుర్ఘుర, మూకీకృతకుకవితుంగముస్తాతతికిన్
    వాకిటికావలితిమ్మన, వాకిటికవికోటి మాధవా కిటికోటే."

అనుడుఁ బెద్దన గర్జారవమున కులికి మాఱు పలుక నోరాడకున్నభట్టు తనత్రోవం జని మఱునాఁ డావృత్తాంత మంతయు రాజునకుం