పుట:Kavijeevithamulu.pdf/185

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అల్లసానిపెద్దన.

171



కడ నెవ్వ రుండి రని భటులతో ముచ్చటింప వా రెవ్వఁడోయొకభట్టు న్నాఁ డని పల్కిరి. దానిచే వాఁడే తనశిష్యుఁ డనియును రాజు తన్ని మిత్తంబుగఁ దనకు వర్తమానము పంచె ననియు నిశ్చయించి రాజుకడ కరుదెంచి యెదుట నిలువంబడియె. అపుడు రా జాతనిం జూచి "కుంజరయూథంబు దోమకుత్తుకఁ జొచ్చెన్" అని సమస్య యిచ్చె. పెద్దన దాని విని యది భట్టుకవిసమస్యగ నూహించి యాతనిం దప్పక చూచి:=

"క. గంజాయి త్రాగి తురకల, సంజాతులఁ గూడి కల్లు చవి గన్నా వా,
    లంజలకొడకా యేటికిఁ, గుంజరయూథంబు దోమకుత్తుక సొచ్చెన్.

అని రోషంబుతో ననిన పెద్దనం గని రాజు నవ్వి యిదినాసమస్య, నన్నుం జూచి సంపూర్ణము సేయు మనుడుఁ జిత్త మని యిట్లనియె :-

"క. రంజన చెడి పాండవు లరి, భంజనులై విరటుకొల్వుపాలైరి కటా
    సంజయ ! విధి నేమందును, గుంజరయూథంబు దోమకుత్తుక సొచ్చెన్."

అని యిట్లు పూర్ణము సేసిన నాతనిసమయస్ఫురణమునకు రాయం డలరి ప్రొద్దాయె, శయనింపఁ బొండు. అని యాతని వీడ్కొలిపి భట్టుం జూచి దయతో నిట్లనియె, ఓయీ ! నీవు భయ మందకుము. నిన్నుఁ గంటికి ఱెప్పయుంబలె నాతనివలన హాని లేకుండ రక్షించెదను. ఇంటికిఁ బొ మ్మని యాతనిఁ బనిచి తాను నారాత్రి నిదురించి మఱునాఁడు రేపకడ లేచి యాస్థానమునకు వచ్చి నిండోలగంబుండి భట్టు ను రావించి సభ్యుల కాతనిం జూపి "యీతని మనయాస్థానపండితులలో నొకనిగ నియమించితిమి. కావున నీతనియెడఁగూడ నాస్థానపండితులకుం జూపుగౌరవమే చూపవలయు" ననియెను. దానికి వారందఱును సమ్మతించిరి.

భ ట్టిట్లు రాజసన్మానము గాంచి విఱ్ఱవీఁగి విద్వజ్జనమును లెక్కింపక యుండెనఁట. ఇట్లుండఁ గొంతకాలంబు సనె. అపు డీతఁడు రాజానుగ్రహము విశేషముగఁ దనయెడఁ గల్గిన ట్లందఱకుం జూప గోరి యొకా