పుట:Kavijeevithamulu.pdf/160

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

146

కవి జీవితములు

తే. పృథులషడ్జస్వనోదీర్ణ భిల్ల పల్ల, వాధరాగీతికాకర్ణ నాతిభీతి
   పరవశాత్మపటీర కోటరకుటీర, లీనఫణి యగునక్కాన గాననయ్యె."

దీని విని భట్టుమూర్తి కెవ్వునఁ గేక వేసి దొరికెరా బాపఁడు అని తలంచి యచ్చో నాఁగు మాఁగు మని పల్కెను. దానికి సభ గడగడ వడంకినది. రామభద్రుఁడును విన్నఁబోయి తనయిష్టదై వంబునకు మ్రొక్కి యచ్చో నూరకుండెను. అపుడు భట్టుమూర్తి లేచియిదే పాదంబు నీశిరస్సున ధరియింపు మనియెను. అపుడు సభలో హాహా కారంబులు సెలఁగినవి. రామభద్రుఁడు మెల్లన నాతని కిట్లనియె. "నా పద్యములోనిదోషము చూపి పిమ్మట నీయిష్టానుసారంబుగ నడుపుము" అనుడు భట్టుమూర్తి "యోయీ ! యిందు వీణానాదము వినుటం జేసి సర్పములు భయము నొంది తొఱ్ఱలం దూఱె నని చెప్పఁబడి యున్నది. ఎచ్చోనైన వీణాగానంబు విని సర్పంబు లుత్సాహంబుతో వచ్చు నని యున్నది గాని దాని విని భయపడి దాఁగె నని చెప్పఁబడి యుండలేదు. కావున నీ యీకల్పన దోషసహితము. కవిసమయసిద్ధము గాదు. ఇఁక నాపాదము శిరమున ధరియింపుము." అనుడు రామభద్రుఁడు భట్టుమూర్తి తనకల్పనకుం జెప్పినదోషం బనుభ్రమ నెఱింగి వీనికి సభలో నవమానంబు నొందుకాలంబు సంప్రాప్తం బయ్యె నని యూహించి యిట్లనియె. "ఓయీ ! శాంతించినచోఁ గొన్ని సమాధానములు చెప్పెద విను" మనుడు భట్టుమూర్తి "వల్లె" యనెను. అంత రామభద్రుఁ డిట్లనియె. "ఓయీ ! నేను షడ్జస్వనము వినుటం జేసి సర్పములు భయపడె నంటిఁ గాని వీణాగానంబుచే ననలేదు. షడ్జస్వనంబునకు కేకి కేక యని భయమంది సర్పములు పాఱెను. దీనికి దోష మేమి కలదు" అనుడు సభ్యు లందఱును "మేలుమేలు రామభద్రుఁడు చెప్పినది లెస్సై యున్న యది" యనిరి. భట్టుమూర్తి యుత్తర మేమియు నీఁ జాలక యూరకుండెను. అపుడు సభవారందఱును రామభద్రు నతని ప్రతిజ్ఞ చెల్లింపవలయు ననిరి. తోడనే భట్టుమూర్తి తనశిరోవేష్టనంబు క్రింద నుంచెను. రామభద్రుఁడు దానిని వామపాదంబున మెట్టెను.