పుట:Kavijeevithamulu.pdf/155

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అయ్యలరాజు రామభద్రయ్య.

141

సీ. మోహాపదేశతమోముద్రితము లైన, కనుదమ్ముల హిమాంబు లునుపరాదు
   శ్రమబిందుతారకాగమఖిన్నకుచకోక, ములఁ జంద్రనామంబుఁ దలఁప రాదు
   శీర్యదాశావృంతశిథిలి తాసులతాఁత, మసియాడ వీవన ల్విసరరాదు
   పటుతాపపుటపాకపరిహీణతను హేమ, మింకఁ బల్లవపుటా ర్చిడఁగ రాదు.

గీ. లలన కానంగకీలికీలాకలాప, సంతతాలీఢహృదయపాత్రాంతరాళ
   పూరితస్నేహపూరంబు పొంగి పొరలఁ, జల్లనిపటీరసలిలంబుఁ జల్లరాదు.

అని వ్రాసిన పద్యముం గొని సంతసంబునఁ జని యావిద్యార్థులు తమగురుం డగుభట్టురామరాజభూషణకవికిం జూపిరి. అతఁడు పద్య మంతయుం జదివి దాని చమత్కృతికి మిగుల సంతసించి దాని పదశయ్యావిశేషములచే నది తనశిష్యకృతము కా దని నిశ్చయించి "దీనిని రచించినవా రెవ్వరో యథార్థముగఁ దెలుపుఁ డని యడిగెను." దాని విని శిష్యులు గడచినవృత్తాంత మంతయుఁ దెల్పిరి.

రామభద్రుని జూడ రామరాజభూషణుఁడు వచ్చుట.

ఆవృత్తాంతము విని రామరాజభూషణుఁ డాపద్యము చెప్పిన వాఁడు గొప్పపండితుఁడని తెలిసి శిష్యులు ముందు నడువ నాదేవళమునకుం జనియెను. ఆకవియును "వీరందఱును దమగురునిం దోడ్తెచ్చు చున్నా రేమిమునిఁగెనో" యని భయంపడఁ దొడఁగెను. రామరాజభూషణుఁడును సమీపించి గాఢాలింగనము సేసికొని యతనివృత్తాంత మంతయుఁ దెలిసికొని తనతోడఁ జనుదెమ్మని తోడ్కొనిచని యొక్కచో విడియించి రెండుమూఁడు దినములు స్వయంపాకములు పంచి రాజుకడకుం జని యతని వృత్తాంతము సెప్పి దర్శనము సేయించి యాస్థానవిద్వాంసునిగ నియమించెను. అనంతర మీపద్యము నాకవియందలి తనగౌరవమును సూచించుటకుఁ గాలాంతరమునఁ దనవసుచరిత్రంబున నుంచె నని వాడుక గలదు.

రామభద్రునిశయ్యాదికము.

ఈకవియును మృదుతరకవనంబునకే ప్రసిద్ధుఁడు. కల్పనాంశమునఁ గూడ మిగుల సమర్థుఁడు. పెద్దనవలె నితఁడును శ్లేష ప్రధానము గాకుండఁ గవిత్వము సెప్పును. ఇతనికవితసరసత పెద్దనరామరాజభూషణా