పుట:Kavijeevithamulu.pdf/154

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

140

కవి జీవితములు



బిల్లలరామభద్రయ్య యనుపేరును గలదు. ఇతఁడు కుటుంబభరణము సేయలేక యొకానొకదినంబునఁ జింతాభరాక్రాంతచిత్తుండై పల్లెల నుంటకంటె నడవియం దుంట యే మేలని చెప్పినపెద్దలవాక్యము ననుసరించి దారాపుత్రాదులను వదలి యరణ్యమున ముని నై యుందుంగాక యని నిశ్చయించుకొని తత్సన్నాహము సేయుచుండెను. దీనినంతయుం జూచి యతనిమిత్రుం డొకరుఁడు వచ్చి యోయీ యిట్లు సేయ న్యాయమా? ఇట్టియుద్యోగము నిం కెన్నడును నూహింపకుము. విద్వాంసుఁ డైనవాఁడు కష్టసుఖములకు ఖేదమోదముల నందకుండవలయును. నీ విచ్చో నుండి కుటుంబసంరక్షణము సేయ లేకున్నచో నేదియైననొక పట్టణమునకుఁ జని యచ్చో నెవరినైన నాశ్రయించి కాలము గడపు మనుడు నాతఁడు ధైర్యముఁ దెచ్చికొని యాదినమునందే తనకుటుంబ సహితముగ బీజనగరు (విజయనగరము) నకుఁ బ్రయాణము నిశ్చయించుకొని శుభముహూర్తమున బయలు వెడలెను. అనంతరము కతిపయదిసములకు నా యూరు సమీపించెను. అపు డొకపెద్దవర్ష మాకస్మికముగ సంప్రాప్త మయ్యెను. మార్గమధ్యమున నీకవి సకుటుంబముగ వానం దడసి యచ్చో నున్న యొక దేవళము చేరెను. అందే కొందఱు జను లావఱకు వచ్చి యుండిరి. వా రందఱును నొకపద్య మూహించుచు నెవరను రచియింపఁజాలక "నీవు మరల యోజింపు మని తమలోఁ దమరు చెప్పికొనుచుండిరి. రామభద్రయ్య వారిం" జూచి "యోబాలులారా ! యేమి వ్రాయుచున్నా" రని యడిగెను. అపుడు వారిలోఁ బెద్దవాఁ డిట్లనియె. "స్వామీ ! మాగురువులవా రొక పద్యముచే విరహిణీ మూర్ఛానంతరకార్యములను వర్ణింపుఁ డనియాజ్ఞ యిచ్చిరి. దానిం జేయలేక చిక్కులఁ బడుచున్నార" మనుడు నాతఁడు నా కిపు డేమైన నుపాయము సెప్పి చలి లేకుండఁ జేసెద రేని నే నీపద్యమును రచియించెద ననియెను. వారలు దానికి సమ్మతించి చుట్టుపట్ల నున్న యాకులం దెచ్చి చలిమట వేసి తమయుత్తరీయములు వానికిం గట్ట నిచ్చిరి. అపు డాకవి మిక్కిలి యానందము నొంది చలి కాఁచికొని ఘంటము నాకుం గొని యీక్రిందిపద్యము వ్రాసెను.