పుట:Kavijeevithamulu.pdf/129

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పిల్లలమఱ్ఱి పినవీరభద్రయ్య.

117



ధ్వనిచేసినవి. అట్టిధ్వనిని దూరంబునం గూర్చుండి శివపూజసేయుచున్న పెదవీరన్న విని, దీనిపావడములక్రింద నందియలు లేకుండుటం జేసి యిట్లు ధ్వని పుట్టుచున్నది. కావున మనము త్వరలో నందియలం జేయింపవలయును. అని నిశ్చయించి ఆపని నెఱవేర్చుపనివాఁ డెవ్వం డని యిద్దఱు ముగ్గురు పనివాండ్రపేరు లూహించి యందులో నమ్మఁదగినవాఁడును, దనయింటికి సమీపంబున నున్న వాఁడును నగునొకకంసాలిని నిశ్చయించి తూర్ణంబుగ నావస్తువు పూర్ణంబు సేయింప నిశ్చయించుచుండెను. ఇట్లీతఁడు పరాయ త్తచిత్తుండై పరంబును మఱచి యుండుతఱి నొకమనుజుఁడు లోనికిఁ జనుదెంచి పెదవీరన్న యున్నాఁడా ? అని కేకవేసెను. దాని నీయాలోచనలో మునిఁగియున్న పెదవీరన్న తిన్నఁగ విని యూహింపలేక పెదవీరన్న యింటికడ లేఁడని యతఁ డె యుత్తరం బిచ్చెను. దాని విని పినవీరన నవ్వి పెదవీరనగారు కంసాలి దుకాణంబుపైఁ గూర్చుండి పెండ్లాముపావడంబులకు నందెలు చేయింపనున్నారు. మఱల రమ్ము పొమ్మనియెను. దాని విని పెదవీరన వెఱఁ గంది స్వమనోగతార్థ మితని కెట్లు గోచరం బయ్యె నని యోజించి యేదియేని యొకమహిమాతిశయం బితనికడఁ గల దని నిశ్చయించెను. ఇంతియ కాక తనమనంబు శివపూజాసమయంబున సంచలించుచున్న దానిం జూపుటకుఁగూడ నాతఁ డావార్తం దెలిపె నని నిశ్చయించి నాఁట నుండియుఁ దమ్మునియెడ జాగరూకుఁడై యుండెను.

పినవీరన పిల్లలకడుపులు గడుగుట

ఇట్లుండ నొకానొకదినంబున నీపెదవీరన శివపూజ సేయుచోఁ దనతమ్ముఁడు భోజనంబునకు రాఁ గని పూజాంతంబువఱకును భోజనంబున కీతఁడు నిలువఁ డని సంశయించి యోరీ! పిల్లలం దోడ్కొని చెఱువునకుఁ బోయి కడుపులోపల వెలపల శుభ్రముగఁ దోమి స్నానంబు సేయించి త్వరతో భోజనము సేయ రమ్మనియెను. ఆమాట విని పినవీరన యా బాలుర సరోవరంబునకుఁ దోడ్కొని చని పొట్టలు