పుట:Kavijeevithamulu.pdf/127

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పిల్లలమఱ్ఱి పినవీరభద్రయ్య.

115



శ్రీనాథుఁడు తన నైషధ మీతనికడకుఁ దెచ్చెను. అపు డతఁడు బాల్య చాపలంబునఁ జెలికాండ్రతో నాడుకొనుచుండెను. ఇతఁడే పినవీరన యగు నని నిశ్చయింప లేక శ్రీనాథుఁడు పినవీరన యెచ్చో నున్నాఁ డని నంప్రశ్నంబు చేసెను. దానిని విని పినవీరనవృత్తాంతమున కేమి గాని నీ వెవ్వండవో యాతనితో నీకుం గల్గుకార్యం బెద్దియో ముందుగఁ దెల్పు మని యడిగెను. అంతటితో నైన నతఁ డితఁడే యని గ్రహింపక వీరనతో నాకొకకార్యంబు గల దని శ్రీనాథుఁడు చెప్పెను. ఆమాట విని వీరనతోఁ గల్గుకార్యంబు నాకుఁ జెప్పునగత్యంబు నీకు లేదు కాని వీరన యెచ్చో నున్నాఁడో దానిఁ దెల్పునగత్యంబు నాకే విశేషంబై యున్నదా ? యేమి ? అనుడు శ్రీనాథుం డాబాలుఁడే వీరన యగు నని యెంచి తాను వచ్చినకార్యము నివేదించెను.

శ్రీనాథుఁడు నైషధముం జూపుట.

శ్రీనాథుఁ డంతఁ దన యాంధ్రనైషధముం జూపి మీరు దీనిని బాగనిన జగద్వ్యాపకం బవున ట్లొనరించెదఁ జూడుఁ డనుడు నాతఁడు శ్రీహర్షనైషధంబులోని దగు "గమికర్మీకృత నైకనీవృతా" అనుదాని నెట్లు దెనిఁగించి తని యడిగెను. అంత "గమికర్మీకృతనైకనీవృతుఁడనై" అని తెనిఁగించితి నని శ్రీనాథుం డనియె. అపుడు వీరన శ్రీనాథుం జూచి నవ్వి యోయీ నీ విందు "నై" తెనిఁగించితివి గాఁబోలు. అనుడు వీరనపల్కుల కేమియు నుత్తర మీఁజాలక శ్రీనాథుఁడు తా నాగ్రంథమును దెనిఁగించుతఱిం జేసినపరిశ్రమవిశేషంబులు దెలుపఁదొడంగెబు, అంత వీరన చిఱునవ్వు నవ్వి యిది మాబోంట్లకుఁ గాకున్న నేమి సామాన్యులకుఁ బఠనార్హం బగుఁ గావున దీనిని జగద్వ్యాపకంబు సేయు మనుడు శ్రీనాథుండు గర్వం బేది నిజావాసంబునకుం జనియె. వీరన యెట్లన్నను శ్రీనాథకృతనైషధము తెనుఁగుగ్రంథంబులలో మిగుల శ్లాఘనీయంబు. సంస్కృతంబునకు సరియైన తెనుఁ గని దీనినిం బండితు లందఱును నొప్పికొని యున్నారు.