పుట:Kavijanaashrayamu-Chandashastramu.pdf/51

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

35

కవిజనాశ్రయము

రనుట సాహసము. సుప్రతిష్ఠిత మైన లక్ష్యసంప్రదాయ మేర్పడియుండినఁ గాని యది లక్షణమున కాధారము కానేరదు. ఎఱ్ఱాప్రెగడ పద్యము తప్ప వేఱుపద్యములు మనకిప్పుడు కనఁబడకుండుటచేఁ బూర్వము లేవని నిర్ణయించుట సముచితము గాదు. యుద్ధమల్లుని శాసనము దొరకకపూర్వము ప్రాచీనసంప్రదాయమునకు నన్నయభట్టారకుపద్యములే కద యాధారముగా గణింపఁబడుచుండెను?

మఱియు లక్ష్యములే మొదటిలక్షణమున కాధారములయి యుండినను నాలక్షణము పుట్టినపిదప బయలుదేఱు లక్ష్యముల కాలక్షణమే విధాయక మగు ననుమాట యనుభవసిద్ధము, శ్రీ శాస్త్రులుగారు పద్యములు చెప్పినప్పు డప్పకవ్యాధి లక్షణగ్రంథముల ననుసరింతురు గాని పూర్వకవి ప్రయోగముల వెదకరుగదా ! ఆలాగుననే తనకాలమందుఁ బ్రచారములో నున్న లక్షణము ననుసరించియే యెఱ్ఱాప్రెగ్గడ పద్యము చెప్పె నని యేల యూహింపరాదు? శాస్త్రులుగారి యాక్షేప మసార మని నామనవి.

జ. రామయ్య.