పుట:Kathalu gaathalu modati bhaagamu.pdf/120

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

వాకిటి కావలి తిమ్మన

113

అక్కడివా రందరూ ఒకరి మొగము లొకరు చూచుకొని తెల్లబోయారు. రాయలవారున్నూ ఏమి జరుగుతుందీ తమాషా చూద్దామని గంభీరంగా ఉన్నారు.

అలాగ సభలోకి రాకూడ దని నిషేధింపబడినవారిలో అల్లసాని పెద్దన మొదలైన హేమా హేమీ లంతా వున్నారు. భట్టు ఇలాగ అన్న తరువాత వీరు రాయలవారి వైపునకు ఛూశారు. గాని వారి ముఖంలో ప్రసన్నభావం కనుపించనందువల్ల చేయునది యేమీ లేక రాయలవారు సభ చాలించిన తరువాత ఖిన్నులై బయటికి వెళ్ళి భట్టు ఏదోకుట్రపన్ని ఇలాగ తమ్ము పరాభవించినాడని ఊహించి, దీనిని గురించి విచారించి తరువాత చేయవలసిన కర్తవ్యాని గురించి ఆలోచించుకోవడానికని వీరు 'వాకిటికావలి ' తిమ్మన్న యనే రాయలవారి అంతరంగిక భృత్యుని యింటిముందర చేరి అక్కడ కూర్చుని ఏదో ఆలోచిస్తూ వున్నారు. అ సమయానికే వీరిని అవమానించిన భట్టు అందలం యెక్కి ఆ దారిని వస్తూ వీరిని చూచి "ఈతిమ్మన్నవాకిట గుమిగూడిన వీ రొక పందుల సమూహములాగ నున్నారు చూశావా అని తన సేవకుడైన మాధవుని సంభో దిస్తూ పైనచెప్పిన చాటు పద్యములోని ఉత్తరభాగమును చదివాడు.

ఈ యద్దేవమాట వినేటప్పటికి అక్కడనున్నవారికి పట్టలేనంత రోషం వచ్చింది. ఈ నీచుడికి తగినట్టుగా బుద్ధిచెప్పాలని పెద్దన్నగారా పద్యంయొక్క పూర్వభాగాన్ని పైనచెప్పినలాగ భావగర్భితంగా పూరించి జవాబుచెప్పారు.

విద్వత్కవుల సంస్కృత ప్రాకృతములను అర్ధము చేసికొనలేక మిడుకు ఈ భట్టువంటి కుకవులు పందుల కాహారముగా నుండే తుంగగడ్డలవంటి వారనిన్నీ, అలాంటివారి కీ కవిబృందము పందులగుంపుగా కనబడడంలో ఆశ్చర్యం లేదనిన్నీ దాని భావం మేము నీవంటి అల్పులను మ్రింగగల వరాహములము సుమీయని ధ్వని. భట్టు ఇదివిని తల వంచుకొని వెళ్ళిపోయి, మర్నాడు రాయలవారితో జరిగిన సంగతి చెప్పగా "నీవు జరిగించిన అపచారానికి తగిన పరాభవం జరిగిం"దని