పుట:Kasiyatracharitr020670mbp.pdf/65

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

స్థలము. రమ్య ప్రదేశము. చుట్టుకొండ లున్నవి. కావలసిన వస్తువులు దొరుకును. బ్రాహ్మణుల యిండ్లున్నవి. మంచినీళ్ళ గుంటయున్నది.

23 వ తేదీ అంజాలమ్మ కనమదాటి వడమాలపేట సత్రము చేరినాను. ఆమడదూరము, అక్కడి కనమ రాతిగొట్టయినా నడచుట నిండా ప్రయాసగాదు. అక్కడ అంజాలమ్మ అనే శక్తి ప్రతిమ పందిటికింద యుంచబడియున్నది. అందులో పరమాత్మ చతన్యము ప్రతిఫలించి ప్రార్తించినవారి యిష్టసిద్ధిని జేయుచున్నది. బాటసరాళము. ఆసత్రము కొల్లాపెద్దసామి శెట్టి కట్టించినది. విశాలముగా నున్నది. బ్రాంహ్యణులకు మాత్రము సదావృత్తి యిచ్చుచున్నారు. వేటబస్తియైనది. కోమట్లు విస్తదించి యున్నందున వారు విరాళమువేసుకొని గోసాయిలకు బైరాగులకు సదావృత్తి యిచ్చున్నారు. తద్ద్వారా సత్రమునకు యశస్సు కలిగియున్నది. కనకమ్మ సత్రము మొదలుకొని యిదివరకు కార్వేటి నగరమువారి సీమ. ఆరాత్రి అలమేలు మంగాపురము మీదుగా దిగువ తిరుపతి చేరినాను. ఆమడదూరము. దొవలో సువర్ణముఖి యనే నదియున్నది. బాటసరాళము. కొంతదూరము చెరువు కట్టమీద నడవవలెను. దోవలో కొన్నిబస్తీ గ్రామములునవి. అక్కడ 2 దినములుంటిని. అందులో నొకనాడు వెంకటాచలపతి దర్సనార్తమై కొండయెక్కి దిగినాను. మరునాడు కపిలతీర్ధములో సమారాధన చేసినాను. దిగువ తిరుపతిలో గోవిందరాజులగుడి కోదండరామస్వామి గుడియు నున్నవి. రామస్వామి గుడికి సరకారు కుమ్మక్కు కొంచమైనాలేదు. గోవిందరాజులగుడి ఆచార్యపురుషుల అధీనముగానున్నది. అయినా సర్కారు విచారణకలదు. త్రిమతస్తులయిండ్లు 200 దనుక గలవు. గురునాధశెట్టి స్మార్తులకు అన్నసత్రము పెట్టియున్నాడు. మునియప్పపిళ్ళ 12 మంది చిన్నవాండ్లకు పాఠకశాల యేర్పరచి అన్నంపెట్టి వేదము చెప్పించుచున్నారు. చందులాలా* వగయిరా ముగ్గురు పుణ్యాత్ములు గోసాంఖాలు వగైరాలకు సదావృత్తి యిచ్చుచున్నారు. మూడు రామానుజ కూకటములున్నవి.


  • చందూలాళ్ హైదరాబాదులో దివాన్ పేష్కారు.