పుట:Kasiyatracharitr020670mbp.pdf/397

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నిత్యము వేలమోడిగా ప్రజలు దిగుతారు గనుక స్థలము సమ్మర్ధముగా వున్నది. సమీపమందు వుండే అంగళ్లలోను, భాటసారులకు కావలశిన పదార్ధాలు అన్ని దొరుకును. యిక్కడ యీరాత్రి వచించినాను. దారియెర్రయిసక. యిరుపక్కలా అడివి. చోర భయము కద్దు.

30 చేది వుదయాన 4 గంతలకు బయిలువెళ్ళి యిక్కదికి ఆమడదూరములో వుండే మన్నారు పోలూరు 2 గంటలకు చేరినాను. దారి నిన్న మధ్యాహ్నము నడిచినటువంటిదేను. యిక్కడ ప్రసిద్ధమయిన కృష్ణ దేవాలయము వున్నది. వూరికి వుభయపార్శ్వాలా కాళించి యమునలు అనే నదులు రెండు చిన్నివిగా ప్రవహిస్తూవున్నవి. యీ గుళ్ళో జాంబవతుని గుహ యనే బావి వొకటి వున్నది. యిక్కడ జాంబవతునితో పోరి శమంతకమణిన్ని, జాంబవవతిన్ని ప్రతిగ్రహించి శ్రీకృష్ణులు విరాజమానుడయినట్టు స్థలపురాణము తెలియపరుస్తున్నది. భక్తాభీష్టములిచ్చే కోదండరామస్వామి ఆలయమున్ను, జాంబవతుని ఆలయమున్ను లోఆవరణములో వున్నది. కృష్ణమూర్తిని వ్యత్యస్తపాదమనే ధ్యాన శ్లోక ప్రకారము నిర్మించి వున్నారు. యిరువైయిండ్ల బ్ర్రాహ్మణులు వున్నారు. అగ్రహారము ముందర తిరుక్కొళము గమణీయముగా వొకటి యున్నది. వెంకటగిరిరాజాగారి నగరు వొకటి కట్టి వున్నారు. అతిరుక్కొళము నీళ్ళు నిండా పాచి అయినప్పటికిన్ని ప్రతియింటా బావులున్నవి గనుక జలవసతి కలదిగానే వున్నది. కాళిందీ నదికి ఆపక్క, కోటపోలూరని వొకటి వున్నది. గడియ దూరములో సూళూరుపేట అనేపేటా వొకటి వున్నది. యిక్కడి నూరిండ్ల నియోగులు చుట్టుపక్కలా వున్నారు. పోలూరిలో ప్రయత్నము మీద కావలశిన పదార్ధాలు దొరుకును. నెల్లూరు మొదలుగా భూమి తొవ్వితే అక్కడక్కడ కావలసి నన్ని గులకరాళ్ళు తియ్యవచ్చును. నిన్నానేడు నదిచిన భాట కొంత మేర రాతిగొట్టుగా వచ్చినది. యిక్కడ యీరాత్రి నిలిచినాను.

31 తేది వుదయమయిన 4 గంటలకు బయిలు వెళ్ళి యిక్కడికి ఆమడదూరములో వుండే చిలకలపూడి రామస్వామి సత్రము 7 గంటలకు చేరినాను. దారి సన్నయిసక పొర. నిండా అడివి లేదు. యీ