పుట:Kasiyatracharitr020670mbp.pdf/343

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


19 తేదీ మధ్యాహ్నమువరకు కటకములో నిలిచి 4 గంటకు బయలుదేరి యిక్కడికి 5 కోసుల దూరములో నుండే గోపాలపూరు అనేవూరు 8 గంటలకు చేరినాను. కటకముముందర చుట్టుకొనివుండే మహానదిని పడవలకుండా నొకసారి దాటినాను. లోగడ మామిడిచెట్లు శాలవుండగా వాటిమధ్యే యిప్పుడు సడక్కు వేసి వున్నది. గనుక బహు రమణియ్యముగా వున్నది. గోపాలపూరు గొప్పవూరు. బాజారు వీథి కద్దు. వూరుమధ్యె వొక సరసింహస్వామి గుడి కట్టి లోపలి ఆవరణలో బ్రాహ్మలు దిగడానకు తాళువారము వేశి వెలిపక్క శూద్రులకు తాళువారమువేశి మిద్దెవేశి కట్టివున్నది. గనుక ఆగుళ్ళోనే దిగడమయినది. నరసింహమూర్తిని సుందరముగా చేసి వుంచినారు. యీమత్స్యదేశపు బ్రాహ్మణుడు రెండుకాలాలున్ను పూజచేస్తాడు. దక్షిణదేశపు చట్టముగా గుడి కొంచములో ముఖమంటపము వుంచి కట్టివున్నది. యీవూళ్ళో అన్నిపదార్ధములు దొరికినవి. గోపాలపూరు ముందర రెండు నదులు కాలినడకగా దాటినాను. వాటిపేళ్ళు భార్గవనది వొకటి, కుశనది వొకటి.

20 తేది వుదయాత్పూర్వము 4 1/2 గంటలకు లేచి యిక్కడికి 10 కోసుల దూరములో నుండే సత్యవాది యనే వూరు 2 గంటలకు చేరినాను. దారిలో పిప్పిలి అనే మజిలీ వూరివద్ద మనుష్యులు తడిశేపాటి వర్షము కురిశినది. రేపటిదినము ద్వాదశి గనుకనున్నుజగన్నాధమహాక్షేత్రములో కొంచము బ్రాహ్మణ భోజనము చేయింతామని యత్నముతో యీదినము యింతదూరపు మజిలీ చేయడమయినది. యీవూరున్ను గొప్పది. మహాస్థలము. వొకమఠములో విశాలముగా స్థలమువుండగా దిగినాను. యిక్కడ గోపాల మూర్తి గుడి వున్నది. వజ్రరెఖయనే నది వొకటి చిన్నదిగా గుడికి సమీపముగా ప్రవహిస్తూవున్నది.

ఈ స్థలమాహాత్మ్యము పూర్వకాలములో గోకుల బృందావన నివాసిగావున్న కులీనుడయిన బ్రాహ్మణుడు, ఆసన్న కాలమందు వుపచరిస్తూ వున్నవాడికి తనకన్యకను యిస్తానని వాగ్దత్తము చేసినట్టున్ను, ఆ వృత్తాంతము కన్యాబంధుజనము అబద్ధమని వాదించినంతలో గోకుల బృందావననివాసి యయిన గోపాలమూర్తి పురుషాకృతి ధరించి