పుట:Kasiyatracharitr020670mbp.pdf/191

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

దారి నడవ కూడలేదు. మిరిజాపురము మొదలుగా భూమి పాల రేగడ గనుక భూమియొండి మనుష్యుల పాదఘట్టన అయ్యే కొద్ది గంధపొడి కన్నా సన్నమయిన యొక దినుసు ధూళి ఉత్పత్తి అయి మనుష్యులకు బహు ప్రయాసగా వుంటున్నది. మిరిజాపురము మొదలు యిక్కడ చెప్పే కోసులు మన దేశపు కోసులో ముక్కాలుకు తక్కువగా వుంటున్నది. యీ అండ్యాసరాయి అనేవూరు నాలుగు భాగములుగా నాల్గు పక్కలా కట్టి వున్నది. అన్నిపదార్ధాలు దొరుకను. నేను సరాయిలో దిగినాను. జలవసతి కద్దు. గుంటలవద్ద చెట్లనీడ బాగాలేదు. ఈ వూరిలో యీరాత్రి నిలిచినాను.

11 తేది ఉదయత్పూర్వము 3 1/2ఘంటలకు లేచి యిక్కడికి 6 కోసులదూరములో వుండే జూసీ సరాయి అనే వూరు 8 ఘంటలకు చేరినాను. దారి నిన్నటివలెనే సడక్కు వేసి మయిలు రాళ్ళూ వేసి వున్నవి. వర్షాకాలములో మన్ను పాలరేగడ గనుక యెంత ఘట్టనపడి మనుష్యుల పాద ఘట్టన బండ్ల రాపుడు విస్తారమయి వుండినప్పటికీన్ని కాళ్ళు ఒక మాత్రముగా దిగబడుతూ వచ్చునని తోచుచున్నది. మిరిజాపూరు మొదలు వూళ్ళు బహు దగ్గిర దగ్గిరగా దారిలో వుంటూ వచ్చినందున అనేక చిన్న గ్రామాల పేళ్ళు వ్రాయడము విస్తరిస్తున్నదని వ్రాయలేదు. వింధ్యవాసిని కొండ అదృశ్యమయిన వెనుక చూపు మేరలో యెక్కడా కొండలు అగుపడడములేదు.

యీ జూసీనరాయి అనే ఊరు గొప్పది. గంగవొడ్డున వున్నది. గనుక గంగకు అటు పక్క వుండే ప్రయాగకోట ఊరున్ను, త్రివేణీ సంగమమున్ను, తెలుస్తూ వుంచున్నది. యిక్కడ గంగ దక్షిణ వాహిని. యమున కలియని శుద్ధగంగలో యీవూరి ఘాటువద్ద స్నానము చేయవచ్చును. యీ ఘాటున మళ్ళీ గంగదాటి ప్రయాగ చేరవలసినది. యిక్కడ గంగ కోసెడు దూరము వెడల్పు కలిగి వున్నది. ప్రవాహవేగము బహు విస్తారము. గంగ ప్రవహించే దేశము, ఇక్కడ ఆభ్రక సంబంధమయిన భూమి గనుక గంగాజలము మెరుస్తూ వున్నది. ఈ వూరిలో ముసాఫరు లాయఖు పదార్ధములన్ని దొరుకుచున్నవి.