పుట:Kasiyatracharitr020670mbp.pdf/158

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కాశీయాత్ర చరిత్ర

యీ మజిలీ వూరు రహితు పుష్టిగలది. నేను దుకాణాలలోనే దిగినాను. యిది నదీతీరము. సకల వస్తువులు ముసాఫరులకు దొరకును. యీరాత్రి యీయూరిలో వసించినాను. జబ్బలపూరులో వుండే తపాలు అఫీసు మ్యానేజరు కుషుచందరుదత్తుబాబు అనేవాణ్ని మంచి తనము చేసుకొని, ప్రతిచౌకిలో నుంచి ఒక తపాలుమనిషి వఛ్ఛేటట్టు జాగ్రత్త చేసు కున్నాను. హయిదరాబాదు మొదలు యీ తపాలు మనిషి కూడావచ్చుటచేత ఖర్చువిస్తారముగా తగులుచూ వచ్చినా యీ పరరాష్ట్రములో దారి తప్పితిమి అనేమాటలేదు. దారి యెటుపోవలసినదని ఒకణ్ణి అడగవలచినది లేకుండా దారితెలిసి నడుస్తూ రాబట్టి సౌఖ్యముగా వున్నది. యీమురువారాలో యీ రాత్రి వసించినాను.

16 వ తేదీ ఉదయాత్పూర్వమే 3 ఘంటలకు బయలుదేరి 10 ఘంటలకు యిక్కడికి 5 కోసుల దూరములో వుండే సభాగంజు అనేయూరు చేరి అమావాస్యగనుక వంటభోజనములు దుకాణాలలో చేసుకొని 2 ఘంటలకు బయిలుదేరి అక్కడికి 5 కోసులలో వుండే గుణవారా అనేయూరు సాయంకాలము 6 ఘంటలకు చేరినాను. నడివూళ్ళు; నెం.12. చెక్కాం జాకాహి 1 సభాగంజు 1 సయగాం 1 గుణవారా 1 - 5

సదరహి మురువారా వద్ద ఒక నదిని దాటవలెను. నేను దోనెలున్నా వాటితో దాటితే కాలమాన మవుచున్నదని మొలలోతు నీళ్ళలో కాలినడకగానే దాటినాను. దారి నిన్నటిదారివలెనే సడక్కువేసి చక్కబరచి యున్నది. అయితే కొంతమేర యెర్రగులక దొరకనందున బంకమట్టితో గట్టించియున్నది. తడిసినతావులో అడుసుగా నుంచున్నది. అయినా కాలు దిగబడడము, జారడమున్ను లేదు. చెక్కా అనే గ్రామము మొదలుగా గుణవారా మజిలీవూరువరకు దారికి నిరుపక్కల సమీపమందు సుందరము లయిన కొండలున్నవి. అవి యథోచితమైన నునుపుగలిగి అందముగా నున్నవి. కుడిచేతిపక్క కొండ బురుజుకు వెంబడి బురుజును కట్టినట్టు యేర్పడియున్నది.