బదులు బండివాడు కాడి బుజాన్ని బెట్టుకు నడవడం, ఎద్దు వెనుక రావడం, వీలునుబట్టి మేముకూడా నడవడం, ఈలాగు రెండు మూడు మకాములు ప్రయాణం జరిగింది. ఎట్లాగయితేనేమి, శ్రీజగన్నాథ క్షేత్రమునకు వచ్చి చేరుకొన్నాము. స్వామివారిమీద చేతనైనది వక అష్టకం "జగన్నాథం నాథం సరిదిన సుతాయా భజమనః" అనే మకుటంతో రచించినాను. సముద్రస్నానం వగయిరా సందర్భాలనుభవిస్తూ అక్కడ వారంరోజులవఱకూ వున్నామని జ్ఞాపకం.
గంజాం - బర్హంపురం
అక్కడ నుండి మళ్లా బండి చేసుకొని గంజాముకు బయలుదేరినాము. చిలక సముద్రం త్రోవనైతే పడవలమీద ప్రయాణం చేయాలి, మధ్యమధ్య తిప్పలమీద వండు కోవాలి, కొంచెం చుట్టుగాని మెట్టమార్గం అంతకంటె వీలని కొందఱు చెప్పారు. ఆమాటమీద చుట్టయినా మెట్టమార్గం మేలన్నారని మెట్టమార్గానే బయలుదేరాము. కాని త్రోవలో పోలీసుజవానుల సాయముతో బయలుదేరిన తహస్సీల్గారుగారినే రాళ్లు రువ్వి దొంగలు చీకాకు పఱచినట్లోక మకాములో తెలిసింది. ఇక అప్పుడేం చేయము? కొన్ని బళ్ల సహాయముతో యెల్లెట్లో చిన్న చిన్న ప్రయాణాలతో గంజాం చేరాము. కలకత్తా బయలుదేరినది మొదలు కటకంలో తప్ప గంజాం వఱకున్నూ స్వహస్త పాకమే. ఒకప్పుడు బండిక్రింద వంట చేసుకోవలసి వచ్చేది. ఎందుచేతనంటే : "ఆడి చినుకూ పొడిచినుకూ" వానపడేటప్పుడు, ఏ చెట్టు క్రిందో మకాం