పుట:Kasi Yatra Chellapilla Venkatasastry.pdf/5

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కాశీయాత్ర

నేనీ పొత్తమును సర్వసాధారణమయిన వ్యావహారిక భాషలోనే వ్రాస్తాను. 64 వత్సరముల నిండు వయస్సులో వ్రాస్తూ వున్న దీనిని చూచి, నన్ను "తుద కబ్బెరా తురకభాష" అని నా మిత్రులూ, శిష్యులూ లోనగువారు కొందఱు నిందింతురని నాకు తెలిసిన్నీ నేనిట్టి భాషను సమర్థించు వారిలో చేరినవాడను కాక యుండిన్నీ ఇందులో వ్రాయుటకు కారణము, నాకు ఈ భాష అంటే అంతగా యిష్టం లేకపోయినా, ద్వేషం కూడా అంతగా లేదని లోకులకు తెలియజేయుటయే నా ముఖ్యోద్దేశ్యము. ఇదిన్నీ గాక, ఈ భాషకు చోటివ్వదగిన కబ్బము లెట్టివో సూచించుటకుగూడ నేనిప్పుడీ పనికి తలపెట్టినాను. ఇప్పుడే కాదు, ఇంతకు పూర్వము కూడా నేనిట్టి పట్టుల నిట్టి భాషనే ఉపయోగించి యుంటిని. పల్లెటూళ్ల పట్టుదలలులోనైనవి చదివినవారి కీసంగతి విశదమే. కావున విస్తరింపక ప్రస్తుతము ప్రారంభిస్తాను. ఇప్పుడు నేను వ్రాయబోయే విషయము అంతో యింతో ‘జాతకచర్య అను పొత్తములో స్పృశించి విడిచిందేకాని క్రొత్తది కాదు. అయితే మరల యెందుకు వ్రాయాలంటే, అందులో నెత్తికొన్నవిషయాలొక్కొక్కటి విడదీసి వ్రాసేయెడల యెంతెంత గ్రంథము పెరుగునో చదువరుల కెఱుకపడే నిమిత్తమే కాని వేఱుకాదు.