పుట:Kashi-Majili-Kathalu.pdf/53

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

42

కాదంబరి

సంక్రమించుటచే లోహితాయమానమగు దుకూలముచేత నావృతమగు నితంబము గలిగి నఖమయాఖములు ప్రతిఫలింప దంతమయమైన వీణను దక్షిణకరంబునం బూని మూర్తీభవించిన గాంధర్వదేవతయోయనఁ దంత్రీనాదములతోఁ గంఠస్వానము మేళగించి పాడుచుఁ బాశుపతవ్రత మనుసరించి దివ్యాకృతితో నొప్పుచున్న యొక చిన్నదానిం గాంచి మేనువులకింప నానృపనందనుఁడు సంభ్రమముతో నాతురంగమును డిగి యావారువమును చేరువ నొకతరుమూలమునంగట్టి యమ్మహాలింగము చెంతకుంబోయి నమస్కరించుచు నక్కాంతారత్నము ననిమేషదృష్టుల మరల నిరూపించి చూచి తదీయ రూపాతిశయమునకుఁ గాంతివిశేషమునకును వెరగందుచు నిట్లు తలంచెను. అన్నన్నా! జంతువులకు నప్రయత్నముననే వృత్తాంతాంతరములు దోచుచుండునుగదా! నేనుయదృచ్ఛముగా వేటకు వెడలినంత గిన్నరమిధునమునుఁ దివ్యజనసంచారయోగ్యమగు ప్రదేశమును గానంబడినది. అందు సలిలము వెదకుచుండ సిద్దజనోప స్పృష్ట జలమగు సరోవరము జూడనయ్యె. తత్తీరమున విశ్రాంతివహించి యుండ నమానుషగీతము విననయ్యె, దానిననుసరించి రాగా నిందు మానుష దర్శన దుర్లభయగు నీచిన్నది కన్నులకు విందుగావించినది.

ఇక్కురంగనయన దివ్యాంగనయని తదాకారమే చెప్పుచున్న యది. ఆహా! మనుష్యాంగనల కిట్టి సౌందర్యమును గాంధర్వమును గలిగియుండునా? దైవవశంబున నీ యోషారత్న మంతర్ధానముజెందనియెడ నీవెవ్వతెవు? నీ పేరేమి? ప్రథమవయస్సున నిట్టివ్రత మేమిటికిఁ బూనితవని యడిగెదనుగదా! అనితలంచుచు నాస్ఫటిక మంటపములో వేరొక స్థంభము మాటునం గూర్చుండి యనాతిగీత సమాప్త్యవసరము ప్రతీక్షించుచుండెను.

ఆనాతియుఁ గీతావసానమున వీణంగట్టి లేచి యమ్మహాలింగ